“ లిక్కర్ స్కామ్ చాలా పెద్దది. జగన్, భారతిలే సూత్రధారులు” అని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఇంగ్లిష్లో సమగ్రంగా ట్వీట్ పెట్టారు. దీనికి కారణం … జగన్మోహన్ రెడ్డి ఏపీలో మిథున్ రెడ్డిది అక్రమ అరెస్టు అని ఇంగ్లిష్లో ట్వీట్ పెట్టడమే . మాణిగం ఠాగూర్ ట్వీట్ పై సజ్జల స్పందించారు. అది కాంగ్రెస్ ట్వీట్ కాదని.. ఎవరైనా ఆ ట్వీట్ ను రాహుల్ కు చూపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ విధానాల ప్రకారమే స్పందిస్తారు కానీ.. సజ్జల కోసం.. జగన్ కోసం కాదని ఆయన ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. తమకు కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందని ఆయన అనుకుంటున్నారు. కానీ జగన్ రెడ్డి చేసిన మోసపు రాజకీయాల వల్ల ఇప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చేందుకు జాతీయ స్థాయిలో ఒక్క పార్టీ కూడా మందుకు రాదు.
ప్రతి అంశాన్ని ఇంగ్లిష్లో ట్వీట్ చేస్తున్న జగన్
జగన్మోహన్ రెడ్డి తనకు జాతీయ స్థాయి మద్దతు అవసరమని భావిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించడానికి ట్వీట్లు పెడుతున్నారు. అది కూడా ఇంగ్లిష్ లో ఎక్కువగా పెడుతున్నారు. రోజాను గాలి భానుప్రకాష్ ఏదో అన్నారని… లిక్కర్ స్కామ్ అంతా కుట్ర అని.. ఏపీలో శాంతిభద్రతలు లేవని.. వైసీపీ నేతలందర్నీ అరెస్టు చేస్తున్నారని.. ఇలా ఏదో ఓ ట్వీట్ ఇంగ్లిష్లో ..జాతీయ పార్టీల దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నారు. అయితే ఆయనకు ఏ వైపు నుంచీ మద్దతు రాకపోగా ఆయన చేసిందే తప్పని కాంగ్రెస్ లాంటి పార్టీలు స్పందిస్తున్నాయి. దీంతో జగన్ ఇంగ్లిష్ ట్వీట్లు కూడా రివర్స్ అవుతున్నాయి.
ఇండీ కూటమి పార్టీల్ని మోసం చేసిన జగన్
ఎన్డీఏ విజయం తర్వాత ఏపీలో రాజకీయాలు మారిపోయాయి. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉండేందుకు కాంగ్రెస్ కూటమి ముందుకు వచ్చింది. ఏమీ జరగకపోయినా .. ఏపీలో హత్యలు జరిగిపోతున్నాయని ఢిల్లీలో ధర్నా చేపడితే.. ఇండీ కూటమిలోని పార్టీల సభ్యులంతా తరలి వచ్చారు. జగన్ కు మద్దతు ఇచ్చారు. అయితే వారి మద్దతును కూడా జగన్ దుర్వినియోగం చేశారు. బీజేపీతో సన్నిహిత సంబంధాలు పెంచుకునేందుకు ఉపయోగించుకున్నారు. ఓ కంపెనీలో ఎక్కువ జీతానికి ఆఫర్ లెటర్ తీసుకుని తమ కంపెనీలో జీతం పెంచుకునే ప్రయత్నం చేసిన ఉద్యోగిలాగా.. తాము అనుకుంటే.. ఇండీ కూటమిలో చేరిపోగలమని చెప్పి.. తమపై చర్యలు తీసుకోకుండా ఆపుకుంటున్నారు. ఇలా ఇండీ కూటమిని మోసం చేశారు.
ఒక్క పార్టీ కూడా జగన్కు సపోర్టు లేదు !
తమను తొక్కేస్తున్నారని రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీకి పోయి ఎవరికైనా చెప్పుకుందామనుకున్నా ఎవరూ అపాయింట్మెంట్లు ఇచ్చే పరిస్థితి లేదు. చివరికి అనుంగు మిత్రుడు కేసీఆర్ కూడా ఆయన మాటల్ని వినే పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి తాను చేసిన స్వార్థపూరిత రాజకీయాలతో తల్లి, చెల్లి మద్దతునే కోల్పోయారు. ఇక ఇతర పార్టీలు మాత్రం ఎందుకు అండగా ఉంటాయి.. తమను వాడుకుని జగన్ రెడ్డి రాజకీయం చేస్తామంటే ఎందుకు సహకరిస్తాయి. జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నుంచి ఏపీలో జరుగుతున్న తమ నేతల అరెస్టుల ఖండించడానికి ట్వీట్లు పెట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. జగన్ రెడ్డి స్వార్థం గురించి అందరికీ అర్థమైంది. ఆయన పూర్తిగా విశ్వసనీయత కోల్పోయారు.