ఈ సంక్రాంతి పోటీ చాలా గట్టిగా ఉంది. తెలుగు నుంచి 5 సినిమాలు వస్తున్నాయి. దాంతో పాటు రెండు డబ్బింగ్ బొమ్మలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఏడు సినిమాలు. చిరంజీవి, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్ హీరోలు కూడా పోటీలో ఉన్నారు. ఎలా చూసినా టఫ్ కాంపిటీషన్. వీటి మధ్యలో తన సినిమా మెరవాలంటే ఏం చేయాలో నవీన్ పొలిశెట్టికి బాగా తెలుసు. అందుకే తన ‘అనగనగా ఒక రాజు’ ప్రమోషన్ల కోసం బాగా కష్టపడుతున్నాడు. అంతా తానొక్కడై నడిపిస్తున్నాడు. సోమవారం హైదరాబాద్ లో ఓ ప్రమోషనల్ ఈవెంట్ చేశాడు నవీన్. పాత్రికేయులతో వెరైటీగా ప్రశ్నోత్తరాల సెషన్ నడిపించాడు. దర్శకుడు, నిర్మాత ఎవరూ స్టేజ్ పై కనిపించలేదు. కథానాయిక మీనాక్షి చౌదరి ఉన్నా – తాను నామమాత్రమే. అంతా తానొక్కడై వన్ మాన్ షో చేసేశాడు.
మీనాక్షి కూడా టీమ్ కి బాగా సపోర్ట్ చేస్తోంది. తాను కూడా ప్రమోషన్లలో నవీన్ తో కలిసిపోతోంది. నిర్మాత నాగవంశీ ఈసారి ప్రమోషన్లకు దూరంగా ఉండబోతున్నారు. ఇది వరకు కొన్ని సినిమాలకు ఎగ్రసీవ్ గా ప్రమోషన్లు చేసి, భారీ స్టేట్ మెంట్లు ఇచ్చి, ఆ తరవాత సినిమాల ఫలితాలు తేడా కొట్టడంతో ఇప్పుడు సైలెంట్ అయిపోవాల్సివచ్చింది. కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా, మీడియా ముందుకు పెద్దగా రాకూడదని డిసైడ్ అయ్యారు. దర్శకుడు మారి కూడా ఏం మాట్లాడడం లేదు. ఇలాంటప్పుడు తన సినిమాని తానొక్కడై ప్రమోట్ చేసుకోవడం మినహా మరో మార్గం కనిపించడంలేదు. ఈ రెండు వారాలూ.. నవీన్ ప్రమోషన్ల విషయంలో ఏకపాత్రాభినయం చేయబోతున్నాడు. మరి ఈ కష్టానికి ఎలాంటి ప్రతిఫలం వస్తుందో చూడాలి.