క్లీన్ ఎంటర్టైనింగ్ సినిమాలు అందివ్వడంలో ముందుంటాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతి సీజన్లో ఇలాంటి సినిమాలు బాగా వర్కవుట్ అవుతాయి. అందుకే ఈ పండక్కి తన సినిమా కూడా వదులుతున్నాడు. ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో ‘అనగనగా ఒక రాజు’ కూడా ఉంది. జనవరి 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నాగవంశీ నిర్మాత. ఈ చిత్రం కోసం నాగవంశీ రూ.40 కోట్ల వరకూ ఖర్చు పెట్టినట్టు టాక్. అయితే.. నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో ఇప్పటికి రూ.27 కోట్లు రాబట్టుకోగలిగారు.
ఓటీటీ నుంచి 19 కోట్లు వచ్చాయి. ఆడియో రైట్స్ రూపంలో రూ.3 కోట్లు దక్కాయి. శాటిలైట్ నుంచి మరో రూ.5 కోట్లు రాబట్టారు. అంటే మొత్తంగా 27 కోట్లన్నమాట. ఓవర్సీస్ హక్కులు రూ.5 కోట్లకు అమ్మారు. అలా చూస్తే ఇప్పటికి రూ.32 కోట్లు రికవరీ చచేయగలిగారు. మరో రూ.8 కోట్లు థియేటర్ నుంచి వస్తే చాలు. సంక్రాంతి సీజన్ లో రూ.8 కోట్లు రావడం పెద్ద విషయం ఏమీ కాదు. ఎలా చూసినా నాగవంశీ ఇప్పుడు సేఫ్ పొజీషన్లో ఉన్నట్టే.
నాగవంశీకి ఈ సినిమా చాలా కీలకం. ఎందుకంటే సితార ఎంటర్టైన్ మెంట్ సంస్థకు గతేడాది గట్టి దెబ్బలే తగిలాయి. ముఖ్యంగా ‘కింగ్ డమ్’ సినిమా ఫ్లాప్ అయ్యింది. ‘వార్ 2’ని తెలుగులో రీలీజ్ చేస్తే భారీ నష్టాలొచ్చాయి. ‘మాస్ జాతర’ అస్సలు ఆడలేదు. 2026లో సితార నుంచి దాదాపు 8 సినిమాలు వస్తున్నాయి. అందులో ‘అనగనగా ఒక రాజు’ ఒకటి. సో.. ఈ సినిమాతో డబ్బులు చేసుకొని 2026లో బోణీ కొట్టాలని చూస్తున్నారు నాగవంశీ.
