నవీన్ పొలిశెట్టి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనలో మంచి రైటర్ కూడా ఉన్నాడు. తన సినిమాలకు సంబంధించిన స్క్రిప్టు పనులు తానే దగ్గరుండి చూసుకొంటాడు. ఇక ప్రమోషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. కొత్తరకం ఆలోచనలతో సినిమాని జనంలోకి తీసుకెళ్లడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ సంక్రాంతికి తన నుంచి ‘అనగనగా ఒక రాజు’ వస్తోంది. చాలా టఫ్ కాంపిటీషన్ మధ్య విడుదల అవుతున్న సినిమా ఇది. ఈ పోటీలో నిలబడాలంటే కచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత చూపించాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రమోషన్లకు కాస్త క్రియేటివిటీ జోడించి చేస్తున్నాడు నవీన్ పొలిశెట్టి.
కథ విషయంలో తాను చాలా కసరత్తులు చేశాడు. ఘోస్ట్ డైరెక్టర్ గానూ.. తాను పని చేశాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. దానికి తోడు నిర్మాత నాగవంశీ కూడా ఈ సినిమా బాధ్యత మొత్తం నవీన్‌కే వదిలేశామన్నట్టు మాట్లాడుతున్నారు. నవీన్‌కి పూర్తిగా క్రియేటీవ్ ఫ్రీడమ్ ఇచ్చేశామని, కథ తానే దగ్గరుండి రాయించుకొన్నాడని, ఇప్పుడు ప్రమోషన్లు కూడా తానే చూసుకొంటున్నాడని, నిర్మాతగా డబ్బులు పెట్టడం మినహా.. ఈ సినిమా విషయంలో తానేం జోక్యం చేసుకోలేదని నాగవంశీ చెబుతున్నారు. సో.. సెట్లోనే కాదు, ఆ సినిమాని ప్రమోట్ చేసే విషయంలోనూ కర్త, కర్మ, క్రియ అన్నీ.. నవీనే అన్నమాట. హీరోలు తమ సినిమా విషయాల్లో పూర్తి ఇన్వాల్వ్మెంట్ తో ఉండడం సహజమే. కానీ అన్ని విషయాలూ తమ భుజాలపై వేసుకొని నడిపించడం మాత్రం అరుదు. రేపు రిజల్ట్ సరిగా వస్తే ఫర్వాలేదు. కానీ అటూ ఇటు అయితే… ఆ ఎఫెక్ట్ మరింత పడే ప్రమాదం ఉంది. ఈ విషయం తెలిసి కూడా నవీన్ రిస్క్ చేశాడు. మరి దానికి తగిన ప్రతిఫలం దక్కిందా, లేదా తెలియాలంటే ఈ సంక్రాంతి సీజన్ ముగిసే వరకూ ఆగాల్సిందే.
