జూబ్లిహిల్స్ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చింది. వెంటనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భావిస్తున్న నవీన్ యాదవ్ .. ఓటర్ కార్డుల పంపిణీ కార్యక్రమం అని ఫ్లెక్సీపెట్టుకుని ఓటర్ కార్డులు పంపిణీ చేశారు. ఇదేందయ్యా..ఇది ఎక్కడా చూడలేదని అందరూ ఆశ్చర్యపోయే సరికి ఎన్నికల అధికారి నిద్ర లేచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నవీన్ యాదవ్ పై కేసు పెట్టారు. అంత వరకూ బాగానే ఉంది కానీ అసలు ఓటర్ కార్డులు పంపిణీ చేయడానికి నవీన్ యాదవ్ కు ఎవరు ఇచ్చారు..అన్నది మాత్రం తేల్చలేదు.
ఓటర్ కార్డులు కొత్తగా నమోదు అయిన వారికి ఎన్నికల సంఘమే ఇస్తుంది. పోస్టులో పంపిస్తుంది లెక్క ప్రకారం. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ చేతుల్లోకి వెళ్లాయి. బహుశా ఆయన నమోదు చేయించిన ఓట్లు అయి ఉంటాయి. ఆయనకే ఇచ్చి పంపిణీ చేసుకోవాలని సూచించి ఉంటారు. ఎందుకంటే ఎంతైనా అధికార పార్టీకి కాబోతున్న అభ్యర్థి కదా. కానీ ఆయన మాత్రం .. అదేదో ప్రభుత్వ పథకాల కార్యక్రమం అనుకుని పంచేశారు. వీడియోలతో సహా షూట్ చేయించుకున్నారు.
ఇప్పుడు ఆయనకు ఆ ఓటర్ కార్డులు ఇచ్చింది ఎవరో ..తేల్చి వారిపై కేసులు పెట్టాల్సి ఉంది. ఆ దిశగా ఎన్నికల సంఘం ఆలోచిస్తుందో లేదో తెలియదు కానీ.. కేటీఆర్ మాత్రం నేరుగా రాహుల్ కు ట్వీట్ చేసి.. ఓటు చోరీ అంటున్నారు.. ఇంత కంటే పెద్ద ఓటు చోరీ ఉంటుందా అని ప్రశ్నలు గుప్పించారు. ఎన్నికలు, ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన లేకుండా రాజకీయాలు చేసే వాళ్లు ఉంటే.. వాళ్లను ప్రోత్సహించే పార్టీలకూ సమస్యలు వస్తాయి.