భారతదేశం నుంచి నక్సలిజం అనే పదాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు పెట్టుకున్న మార్చి 31, 2026 డెడ్ లైన్ సమీపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ ద్వారా మావోయిస్టుల కంచుకోటలైన దండకారణ్యం, అబూజ్మడ్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు మున్నెన్నడూ లేని విధంగా పట్టు సాధించాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2025లోనే దాదాపు 317 మందికి పైగా మావోయిస్టులు హతమవ్వగా, సుమారు 2,000 మందికి పైగా లొంగిపోయారు. గత పదేళ్లలో 126 జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ సమస్య ఇప్పుడు కేవలం 8 నుంచి 11 జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యారని రికార్డులు చెబుతున్నాయి.
గణపతి లొంగిపోతే ప్రకటన చేయవచ్చు!
మావోయిస్టు పార్టీలో దశాబ్దాల కాలం పాటు చక్రం తిప్పిన మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతిలొంగుబాటుకు సిద్ధమైనట్లు వార్తలు రావడం ఈ డెడ్ లైన్ ముందు జరిగిన అతిపెద్ద పరిణామం. సుమారు 77 ఏళ్ల వయస్సు కలిగిన ఆయన అనారోగ్య కారణాలతో నేపాల్ నుంచి దిల్లీకి చేరుకున్నారని, త్వరలోనే అమిత్ షా సమక్షంలో అధికారికంగా లొంగిపోయే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాలుచెబుతున్నాయి. దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి వంటి అగ్రనేతలు ఇప్పటికే లొంగిపోవడం పార్టీ నైతిక స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది.
చివరి రోజులు – క్లీన్ స్వీప్ వ్యూహం
డెడ్ లైన్ గంటల్లోకి రావడంతో మిగిలి ఉన్న మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్రం జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తోంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ సరిహద్దుల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేయడమే కాకుండా, ఇంకా అడవుల్లో ఉన్న వారు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని ప్రభుత్వం చివరి హెచ్చరికలు జారీ చేసింది. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తూనే, ఆయుధాలు పట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
శాంతి భద్రతలే లక్ష్యంగా ముందడుగు
రెడ్ కారిడార్ కలలను భగ్నం చేస్తూ నక్సల్ ముక్త్ భారత్ దిశగా మోదీ ప్రభుత్వం సాధించిన ఈ విజయం చారిత్రాత్మకమైనది. కేవలం తుపాకులతోనే కాకుండా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, మొబైల్ టవర్లు, పాఠశాలల నిర్మాణంతో అభివృద్ధిని వేగవంతం చేయడం వల్ల ప్రజల్లో మార్పు వచ్చింది. మార్చి 31 తర్వాత దేశంలో మావోయిస్టు అనే ఆనవాళ్లు లేకుండా చేయాలనే అమిత్ షా లక్ష్యం దాదాపుగా నెరవేరినట్లే కనిపిస్తోంది.
