భారతదేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద సవాలుగా నిలిచిన నక్సలిజం అంతమైపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మార్చి 31 డెడ్ లైన్ పెట్టుకున్న ఆయన తన లక్ష్యం పూర్తి చేసినట్లుగాప్రకటించారు. ఇది ఒక చారిత్రక పరిణామం. దశాబ్దాల పాటు ఎర్రని జెండా నీడన సాగిన సాయుధ పోరాటం, వేలాది మంది ప్రాణాలను బలిగొన్న రక్తపాతం ఇప్పుడు ముగిసింది.
ఆయుధం అలిసిపోయింది.. నాయకత్వం ముసలిదైంది
ఒకప్పుడు దేశంలోని 10కి పైగా రాష్ట్రాలను గజగజలాడించిన నక్సల్స్ ఇప్పుడు కేవలం కొన్ని జిల్లాలకే పరిమితమయ్యారు. గణపతి వంటి అగ్రశ్రేణి నాయకులు రికార్డుల్లో ఉన్నప్పటికీ, వారంతా ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నారు. అడవుల్లో తిరగడానికి, దాడులు చేయడానికి అవసరమైన శారీరక శక్తి వారిలో సన్నగిల్లింది. ప్రాణాలను కాపాడుకోవడానికి దాక్కోవడమే వారికి ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. కొత్త రక్తం చేరకపోవడం, సాంకేతికత పెరగడం, నిఘా వ్యవస్థలు పటిష్టం కావడంతో.. తుపాకీ గొట్టం ద్వారా అధికారం వస్తుందనే వారి మొండి వాదన ఆచరణలో అసాధ్యమని తేలిపోయింది. అమిత్ షా ప్రకటన ఈ భౌతిక విజయానికి సంకేతం.
సిద్ధాంతం – హింసకు కాలం చెల్లింది
రాజ్యపాలనను కూలదోసి, సాయుధ విప్లవం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే నక్సలైట్ల ప్రాథమిక సిద్ధాంతం కాలగర్భంలో కలిసిపోయింది. ప్రజాస్వామ్యం వేళ్లూనుకున్న దేశంలో, తుపాకీతో ప్రజల మద్దతు పొందలేమని చరిత్ర నిరూపించింది. అభివృద్ధి ఫలాలు మారుమూల ప్రాంతాలకు చేరుతుండటం, రహదారులు, విద్యుత్, ఇంటర్నెట్ వంటివి అడవి బిడ్డలకు చేరువవడంతో సాయుధ పోరాటం తన ఉనికిని కోల్పోయింది. హింసా మార్గం ద్వారా మార్పును ఆశించడం ఇక ఎంతమాత్రం సాధ్యం కాదని నేటి తరం యువత కూడా గుర్తించింది.
అంతం కాని పోరాట సిద్ధాంతం
సాయుధ నక్సలిజం అంతం కావచ్చు కానీ, ఆ సిద్ధాంతం పుట్టడానికి కారణమైన సామాజిక అన్యాయం పూర్తిగా పోయిందా? అన్నది ప్రశ్న. నిస్సహాయుల కోసం అండగా ఉండాలి, పీడిత వర్గాలకు న్యాయం జరగాలి, అడవి-నీరు-భూమిపై స్థానికులకే హక్కు ఉండాలనే భావజాలం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. నక్సలిజం ప్రారంభంలో ఉన్న ఈ మూల సిద్ధాంతాలు నేరం కాదు. ఆకలి ఉన్నంత కాలం, అన్యాయం జరిగినంత కాలం.. ఎక్కడో ఒకచోట గొంతుకలు లేస్తూనే ఉంటాయి. కాకపోతే, అవి ఇప్పుడు తుపాకీ గొట్టం నుండి కాకుండా, రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా వ్యక్తమవుతున్నాయి.
నక్సలిజం తన రూపాన్ని మార్చుకుంది. అడవి నుంచి అది ఇప్పుడు అహింసాయుత ఆందోళనల వైపు మళ్లింది. చట్టపరమైన పోరాటాలు, పౌర సమాజ ఉద్యమాలు, రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్ర్యం ద్వారా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి శుభపరిణామం. సాయుధ నక్సలిజాన్ని తుదముట్టించిన ప్రభుత్వం, ఆ సిద్ధాంతం వెనుక ఉన్న మూల కారణాలను కూడా పరిష్కరించినప్పుడే అది నిజమైన విజయం అవుతుంది.


