తమిళ రాజకీయ నేతలు అతికి పరాకాష్టగా మారుతున్నారు. దేనికైనా హీరోయిన్లను ఉదాహరణగా చూపించి అతి చేస్తున్నారు. అన్నాడీఎంకే నేత ఒకరు నయనతారను రాజకీయాల్లోకి తీసుకు వచ్చి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఇటీవల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ కలలను పంచుకోండి, వాటిని ప్రభుత్వం నెరవేరుస్తుంది అని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు చేసే క్రమంలో అన్నాడీఎంకే నేత షణ్ముగం అదుపు తప్పి మాట్లాడారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు మనల్ని కలలు కనమన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా మీ కలలను పంచుకోండి నెరవేరుస్తాం అంటున్నారు. ఇప్పుడు నాకేదో కల వచ్చింది అనుకుందాం.. నాకు నయనతార కావాలని చెబితే, స్టాలిన్ నా కల నెరవేరుస్తారా? ఎవరైనా వెళ్లి నాకు నయనతారతో పెళ్లి చేయమని అడిగితే ఆయన చేస్తారా? అంటూ ప్రశ్నించారు.
ఇక్కడ విషయం ఏమిటంటే తమిళనాడులో మహిళలకు భద్రత లేదని చేస్తున్న నిరసనలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఎదుట ఉన్న వారికి కాసేప అర్థం కాలేదు. కానీ తర్వాత అది జోక్ అనుకుని నవ్వారు. ఇప్పుడు ఆయన మాటలు దుమారం రేపుతున్నాయి. మహిళల భద్రత కోసం చేస్తున్న ఆందోళనలో కూర్చుని, ఒక మహిళా నటిని ఉద్దేశించి ఇంత అసభ్యంగా మాట్లాడటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు, మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. నడిగర్ సంఘం కూడా షణ్ముగంపై మండిపడింది. తర్వతా ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని చెప్పినా..వారి మానసిక స్థితిపై మాత్రం అందరికీ క్లారిటీ వచ్చేసింది.


