ఇటీవల కురిసిన భారీ వర్షాలు, అకాల వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. ఈ క్లిష్టమైన పరిస్థితులలో బాధితులకు తన వంతు సాయంగా రూ.50 లక్షలు ప్రకటించారు నందమూరి బాలకృష్ణ. కథానాయకుడిగా 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం పూర్తి చేసుకొన్న ఏకైక నటుడిగా వరల్డ్ బుక్ రికార్డ్స్ సంస్థ బాలయ్యని ఈరోజు హైదరాబాద్ లో సత్కరించింది. ఈ సందర్భంగా బాలయ్య ఈ విరాళం ప్రకటించారు. జగిత్యాల, కామారెడ్డి వరదల వల్ల చాలామంది నష్టపోయారని, అపార పంట నష్టం వాటిల్లిందని, ఇదో ఉడతాభక్తి సాయమని, ఇక మీదట కూడా ఇలానే తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
వరల్డ్ రికార్డ్ సందర్భంగా సన్మాన కార్యక్రమం అంతా అయిపోయిన తరవాత బాలయ్య ఈ ప్రకటన చేయడం విశేషం. ఇలా విరాళాలు ప్రకటించి, వాటిని రాజకీయాలకు వాడుకొనే ఉద్దేశ్యం లేదని, అందుకే ఆ హడావుడి అయిపోయిన తరవాత ప్రకటించానని బాలయ్య చెప్పడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగు సినిమాల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేయాలని, అక్కడ మౌళిక వసతులు కల్పించి, కళాకారులకు జీవనోపాధి అందించాలని కోరారు బాలయ్య. తెలుగు చిత్రసీమ ఆస్కార్ స్థాయికి వెళ్లిందని, ఇది తెలుగువాళ్లంతా గర్వపడాల్సిన సమయం అని చెప్పుకొచ్చారు. ఈ యేడాది తనకు బాగా కలిసొచ్చిందని, ఈమధ్య కాలంలో వరుసగా నాలుగు విజయాలు దక్కాయని, పద్మ భూషణ్ పురస్కారం కూడా అందిందని, అన్ స్టాపబుల్ కార్యక్రమం దేశంలోనే నెంబర్ వన్ షోగా కీర్తి గడించిందని, భగవంత్ కేసరి చిత్రానికి జాతీయ అవార్డు దక్కిందని ఇలాంటి సందర్భంలోనే యాభై ఏళ్ల ప్రస్థానం పూర్తి చేయడం గర్వంగా ఉందని, ఇక మీదట కూడా ఇలానే గొప్ప సందర్భాలలో అభిమానుల్ని కలుస్తానని బాలయ్య పేర్కొన్నారు.