న్యాయవ్యవస్థలో అవినీతి వల్ల కేసుల విచారణలు ముందుకు సాగడం లేదని ఎనిమిదో తరగతి పిల్లలకు పాఠాలు చెప్పాలనుకుంది ఎన్సీఈఆర్టీ. ఈ పుస్తకంలో పాఠం సంచలనం సృష్టించింది. న్యాయవ్యవస్థపై ఇలాంటి అభిప్రాయాలను పిల్లల మెదళ్లలోకి ఎక్కిస్తారా అని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికి కేంద్రం దిగి వచ్చింది. ఆ పాఠాలను తీసేస్తామని చెప్పింది. అయితే ఆ పాఠం రచయిత ఏముకున్నారో కానీ.. కేసుల విచారణలు చాలా వరకూ పెండింగ్ లో ఉండాటనికి అవినీతి కూడా ఓ కారణం చెప్పారు. దానికి పరిష్కారాలు కూడా చెప్పారు.
న్యాయవ్యవస్థపై అపనమ్మకాన్ని నూరిపోయడం ప్రమాదకరం
న్యాయవ్యవస్థ అనేది ప్రజాస్వామ్యానికి చివరి ఆశా కిరణం. సామాన్యుడికి ఎక్కడ న్యాయం జరగకపోయినా, కోర్టు మెట్లు ఎక్కితే తనకు న్యాయం జరుగుతుందనే బలమైన నమ్మకం భారతదేశంలో ఉంది. పిల్లల మెదళ్లు పచ్చి మట్టి లాంటివి. వారిలో వ్యవస్థల పట్ల వ్యతిరేకతను లేదా అపనమ్మకాన్ని నూరిపోయడం ప్రమాదకరం. న్యాయవ్యవస్థలో లోపాలు ఉండవచ్చు, కానీ వాటిని పాఠ్యాంశాలుగా మార్చి అవినీతి వల్లే విచారణలు ఆగుతున్నాయి అని చెప్పడం వ్యవస్థను కుప్పకూల్చడమే అవుతుంది. సుప్రీంకోర్టు హెచ్చరించినట్లుగా, న్యాయవ్యవస్థపై గౌరవం పోతే సమాజంలో అరాచకం పెరుగుతుంది. అందుకే కేంద్రం ఆ పాఠాలను తొలగించడానికి ఒప్పుకోవడం సరైన నిర్ణయం. అయితే, వ్యవస్థలో సంస్కరణలు అవసరమన్న రచయిత ఉద్దేశం చెడ్డది కాకపోయినా, అది చెప్పే విధానం మాత్రం విజ్ఞతతో కూడి ఉండాలి.
వ్యవస్థలపై అందరికీ సమాన బాధ్యత
కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండటానికి కేవలం అవినీతి ఒక్కటే కారణం కాదు. జనాభా నిష్పత్తికి తగ్గట్లుగా న్యాయమూర్తులు లేకపోవడం, మౌలిక సదుపాయాల కొరత, పాతబడిన చట్టాలు ప్రధాన కారణాలు. వ్యవస్థలో లోపాలను సరిదిద్దాల్సింది చర్చల ద్వారా, సంస్కరణల ద్వారానే తప్ప.. భావి భారత పౌరుల మనసుల్లో విషం నింపడం ద్వారా కాదు. న్యాయవ్యవస్థ పట్ల ప్రజలు, ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలి. అదే సమయంలో ఆ వ్యవస్థ కూడా సమాజం పట్ల అత్యంత బాధ్యతగా ఉండాలి. న్యాయం జరగడం ఎంత ముఖ్యమో, అది జరుగుతున్నట్లు కనిపించడం కూడా అంతే ముఖ్యం. తీర్పుల వెనుక ఉన్న తర్కం సామాన్యుడికి అర్థం కావాలి. వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లొసుగులను సాకుగా చూపి మొత్తం వ్యవస్థకే మసి పూయడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు.
ఇటీవలి కాలంలో అనేక సందేహాలు
ఆయేషా మీరా వంటి కేసుల్లో జరిగిన దర్యాప్తు లోపాలు, తీర్పుల ఆలస్యం ప్రజల్లో అసహనాన్ని కలిగిస్తున్నాయి. నేరం జరిగింది కానీ నేరస్థుడు ఎవరో తెలియదు అన్నట్లుగా వచ్చే తీర్పులు బాధితుల కుటుంబాలను కుంగదీస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో న్యాయవ్యవస్థ తన విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తీర్పులు కేవలం సాంకేతిక అంశాల ఆధారంగానే కాకుండా, సామాజిక న్యాయం ప్రతిబింబించేలా ఉండాలి. దర్యాప్తు సంస్థల వైఫల్యాలను కోర్టులు ఎత్తిచూపినప్పుడే వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుంది. ఇటీవల ఇన్ స్టంట్ శిక్షల అమలును ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాగ్రహాన్ని తగ్గించడానికి ప్రభుత్వలూ అదే పని చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు రాకూడనంత చురుగ్గా న్యాయవ్యవస్థ పని చేయాలని ప్రతి ఒక్కరి కోరిక.
