సినిమా అంటేనే ఫ్యాషన్ తో ముడిపడిన రంగం. ముస్తాబులకు పెద్ద పీట వేస్తారు. కాస్ట్యూమ్స్ పై ప్రత్యేకమైన శ్రద్ద చూపిస్తారు. సినిమాల్లో, సినిమా వేడుకల్లో, ప్రైవేటు కార్యక్రమాల్లో సెలబ్రెటీలు మెరవాలంటే.. దుస్తులపై వీలైనంత పెట్టుబడి పెట్టాల్సిందే. ఒక్కోసారి వాళ్ల కాస్ట్యూమ్స్ లక్షల్లో ఉంటాయి. ఓ హీరో అయితే ఒక్క టీషర్ట్ ని ఏకంగా 7 లక్షలు పెట్టి కొనిపించాడట. ఈ విషయం ప్రముఖ కాస్ట్యూమర్ నీరజ కోన తెలుగు 360కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టారు. చాలామంది హీరోలు బ్రాండెడ్ దుస్తుల మోజులో ఉంటారని, ఓ హీరో పట్టుబట్టి 8 వేల డాలర్లతో ఓ టీషర్ట్ కొనిపించాడని చెప్పుకొచ్చారు. కానీ ఆ హీరో ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు. దాంతో 7 లక్షల టీషర్ట్ కొన్న హీరో ఎవరంటూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ మొదలైపోయింది. కొంతమంది ఎన్టీఆర్ అంటుంటే, ఇంకొంతమంది బన్నీ పేరు చెబుతున్నారు.
”అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ స్టైలింగ్ బాగుంటుంది. నాని సింపుల్ డ్రస్స్ లోనూ బాగుంటాడు. తనకు ఏ డ్రస్ అయినా సూటైపోతుంది. నాగచైతన్య స్టైలింగ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. హీరోయిన్లు సినిమా వేడుకలకు ఖరీదైన కాస్ట్యూమ్స్ ధరించి వస్తుంటారు. అయితే అవన్నీ డిజైనర్ వేర్స్. పార్టీల్లో ఇలాంటి డిజైనర్ వేర్స్ ధరించి రావడం కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ. ఆ దుస్తులన్నీ డిజైనర్లు హీరోయిన్లకు ఉచితంగా అందిస్తారు. దాంతో ఆయా దుస్తులకు డిమాండ్ పెరుగుతుంది” అంటూ అసలు సిసలైన ట్రేడ్ సీక్రెట్ బయట పెట్టారు. ఎన్నో వందల చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసిన నీరజ కోన ఇప్పుడు ‘తెలుసు కదా’తో దర్శకురాలిగా మారిపోయారు. ఈ దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది.