ట్రాఫిక్ కానిస్టేబుల్ జయశాంతి వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో రెండంచుల కత్తిలా మారింది. ఒకవైపు ఆమె నిబద్ధతకు ప్రశంసలు కురుస్తుంటే, మరోవైపు ఆమె గతాన్ని తవ్వుతూ జరుగుతున్న విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. ఒక చేత్తో చంటిబిడ్డను పట్టుకుని, మరో చేత్తో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న కానిస్టేబుల్ జయశాంతి వీడియో దేశవ్యాప్తంగా నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక తల్లి పడుతున్న కష్టానికి, వృత్తి పట్ల ఆమెకున్న అంకితభావానికి సెల్యూట్ చేశారు. స్వయంగా హోంమంత్రి ఆమెను పిలిపించి అభినందించడం ద్వారా ఆ కష్టానికి తగిన గుర్తింపు లభించిందని అందరూ భావించారు. అయితే, ఎప్పుడైతే ఆమెకు ప్రశంసలు రావడం మొదలయ్యాయో, వెంటనే ఆమె వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు ప్రారంభించారు.
జయశాంతి చూపించిన స్ఫూర్తి ముఖ్యం
జయశాంతిపై వస్తున్న ఆరోపణలు, ఆమె గతంలోని ఉద్యోగ విషయాలు లేదా వ్యక్తిగత అప్పుల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఒక రకమైన వ్యక్తిత్వ హననం లా కనిపిస్తోంది. ఒక వ్యక్తికి మంచి పేరు వస్తున్నప్పుడు వారి గతాన్ని తవ్వి నెగటివిటీని ప్రచారం చేయడం మన సమాజంలో ఒక జాడ్యంగా మారింది. డీఎస్సీలో టీచర్ ఉద్యోగం వచ్చినా భర్త ఉద్యోగం దాచి పెట్టడం వల్ల ఆమె ఉద్యోగం క్యాన్సిల్ అయింది. ఇంకా అనేక ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ తప్పించుకోవడానికే ఈ వీడియో చేశారని నిందిస్తున్నారు. నిజంగా ఇలాంటి వీడియో చేస్తే వైరల్ అవడం ఆమె చెతుల్లో ఉంటుందా?. సోషల్ మీడియా ప్రపంచంలో ఏది వైరల్ అవుతుందో.. ఎవరూ చెప్పలేరు. ఆమె చేసింది నిజమే.. వీడియో కోసం చేసినా నిజమే. ఆమె అలా చేయడం స్క్రిప్టెడ్ అని అనుకున్నా చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. ఇలాంటి పనుల్ని ప్రోత్సహించాలి.. అభినందించాలి కానీ..ఆమెకు ప్రశంసలు వస్తున్నాయని కుట్రలు చేయకూడదు.
తప్పులు వెదకడం కన్నా మంచిని చూడటం ముఖ్యం
ఆమె చేసిన పని వీడియో కోసం చేసినా లేదా స్క్రిప్టెడ్ అని కొందరు వాదించినా.. ఆ వీడియో ద్వారా సమాజానికి వెళ్ళిన సందేశం మాత్రం సానుకూలమైనది. ఎంతో మంది శ్రామిక మహిళలకు అది ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఒకవేళ ఆమె సానుభూతి కోసమే ఆ పని చేసిందని అనుకున్నా, ట్రాఫిక్ మధ్యలో బిడ్డను పట్టుకుని నిలబడటం అనేది ప్రాణాలతో కూడుకున్న విషయం. అది అంత సులభమైన పని కాదు. ఆమె చేసిన పనిలో నిజాయితీ ఉంది కాబట్టే అది లక్షలాది మందికి కనెక్ట్ అయింది. ఇలాంటి ఉదంతాలను కేవలం తప్పులు వెతకడానికి వాడటం కంటే, ఒక తల్లి పడుతున్న శ్రమగా చూడటం కనీస ధర్మం.
ప్రభుత్వ ప్రోత్సాహం విధుల్లో కష్టపడుతున్న వేలాది మంది మహిళా ఉద్యోగులకు!
ప్రభుత్వ పెద్దలు ఆమెను అభినందించడం అనేది కేవలం ఒక వ్యక్తికి ఇచ్చిన గౌరవం కాదు, విధుల్లో కష్టపడుతున్న వేలాది మంది మహిళా ఉద్యోగులకు ఇచ్చిన ప్రోత్సాహం. కుట్రపూరితంగా ఆమె వ్యక్తిగత జీవితాన్ని విమర్శల పాలు చేయడం ఆ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. తప్పులు ఉంటే చట్టం చూసుకుంటుంది, కానీ ఆమె చేసిన మంచిని అభినందించే సంస్కారాన్ని మనం అలవర్చుకోవాలి. ఇప్పటికైనా నిందారోపణలు ఆపి, ఆమెలోని పోరాట పటిమను గౌరవించాల్సిన అవసరం ఉంది.
