నెల్లూరు లేడీ డాన్‌గా ప్రచారంలోకి వచ్చిన నిడిగుంట అరుణ వ్యవహారం పోలీసు శాఖలోనూ కలకలం రేపుతోంది. పోలీసు ఉన్నతాధికారుల్నే ఆమె గుప్పిట పట్టుకుని చేసిన వ్యవహారాలు అందర్నీ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. నిడిగుంట అరుణ చాలా ప్లాన్ తోనే అన్నీ చేశారు. ప్రతి వ్యవహారం తన ఫోన్లో నిక్షిప్తం చేసుకున్నారు. తర్వాత సమస్య వస్తే బ్లాక్ మెయిల్ చేయడానికి సరిపడా సరుకు తన వద్ద పెట్టుకున్నారు. ఇప్పుడా పోన్ పోలీసుల వద్దకు చేరింది.
అరుణను అరెస్టు చేసినప్పుడు ఆమె ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆమె లాక్ తీయడం లేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసులకు ఆ ఫోన్ లాక్ తీయడం లేదా తీయించడం క్షణాల్లో పని. తీయకుండా ఉండే అవకాశాలు లేవు. తీసే ఉంటారని అనుమానిస్తున్నారు. కానీ అలా ఫోన్లలో సమాచారం తీసుకోవాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలి. ఆ దిశగానే న్యాయపరమైన ప్రయత్నాలు చేయాలని నెల్లూరు పోలీసులు నిర్ణయించారు.
అయితే ఆ ఫోన్లలో ఉన్నది నెల్లూరు ఎస్పీలుగా చేసిన ఇద్దరు ఉన్నతాధికారుల బాగోతం అని ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. ఓ ఎస్పీ అయితే అరుణతో కలిసి గోవా ట్రిప్పులకు వెళ్లారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే చాలా దందాలు చేశారని అంటున్నారు. తమ పోలీసులే కాబట్టి..వారిపై వివరాలు బయటకు రాకుండా.. డిపార్టుమెంట్ చూసుకుంటుందా లేకపోతే.. ఇలాంటి వారిని ఉపేక్షించకూడదని అనుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.
అరుణ .. శ్రీకాంత్ తో పాటు పోలీసుల సాయం చేసిన దందాలు, సెటిల్మెంట్లపై వరుసగా పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. వారు పెంచి పోషిస్తున్న రౌడీ షీటర్లను పోలీసులు జైలుకు పంపుతున్నారు.