రాజీనామాలు చేసి పారిపోతున్నప్రధానుల జాబితాలో తాజాగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి చేరారు. సోషల్‌మీడియాను బ్యాన్ చేయడంతో రగిలిపోయిన యువత ఉద్యమం చేపట్టారు. దీనికి అవినీతి, నిరుద్యోగం కారణాలు కూడా కలిసి మొత్తంగా యువత సహనం కోల్పోయేలా చేశాయి. దాంతో నేపాల్ అట్టుడికిపోయింది. పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించడంతో ఆర్మీ కాల్పులు జరిపింది. ఇరవై మంది వరకూ చనిపోవడంతో పరిస్థితి పూర్తిగా కట్టు తప్పింది.
మంగళవారం ఉదయమే సోషల్ మీడియా బ్యాన్ ను ఎత్తివేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. కానీ యువత తగ్గలేదు. యువత ఆగ్రహం చూసి నేపాల్ ప్రభుత్వంలోని మంత్రులంతా రాజీనామాల బాట పట్టారు. ప్రధానులు, మాజీ ప్రధానుల ఇళ్ల మీదకు యువత వెళ్లారు. ఇష్టం వచ్చినట్లుగా దాడులు చేశారు. దాంతో ప్రధాని కేపీ శర్మ ఓలీతోనూ ఆర్మీ రాజీనామా చేయించింది. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తనను సురక్షితంగా దేశం బయటకు పంపాలని ఓలీ ఆర్మీని వేడుకున్నారు. ప్రస్తుతానికి ఆయనను రహస్య ప్రాంతానికి తరలించారు.
ఇలా ప్రధాని రాజీనామా చేసి పారిపోయే పరిస్థితి వచ్చిన భారత్ పొరుగున ఉన్న మూడో దేశం నేపాల్. గతంలో శ్రీలంకలో అలాగే పారిపోయారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు సర్దుకున్నాయి. తర్వాత బంగ్లాదేశ్ ప్రధాని కూడా పారిపోవాల్సి వచ్చింది. బెంగాల్ లో ఇంకా పరిస్థితులు సద్దుమణగలేదు. ఇప్పుడు.. నేపాల్ లో అలాంటి పరిస్థితి వస్తోంది. పాలకులు ప్రజల ఆకాంక్షలను అందుకోకపోతే.. వారిపై పెత్తనం చేయాలనుకుంటే.. ఎప్పుడో ఓ సారి ఆ అసహనం కట్టు తెగే ప్రమాదం ఉందని ఈ దేశాల యువత నిరూపిస్తున్నారు.