హైదరాబాద్ నగరం గ్లోబల్ విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్-ప్రొడక్షన్ రంగంలో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ప్రపంచ దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ మార్చి 12న హైదరాబాద్‌లో తన హై-ఎండ్ విఎఫ్ఎక్స్ , పోస్ట్-ప్రొడక్షన్ హబ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, వాల్ట్ డిస్నీ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను నిర్వహిస్తుండగా, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ చేరికతో భాగ్యనగరం గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీ మ్యాప్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగింది.
హైదరాబాద్ ఇప్పటికే అంతర్జాతీయ యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ ,కామిక్స్ రంగానికి చిరునామాగా మారింది. స్కైలైన్ విఎఫ్ఎక్స్, మ్యాటెల్, బార్న్స్టార్మ్ విఎఫ్ఎక్స్ వంటి సంస్థలతో పాటు ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ , ఉబిసాఫ్ట్ వంటి గేమింగ్ దిగ్గజాలు ఇక్కడి నుంచే తమ ప్రపంచ స్థాయి ప్రాజెక్టులను రూపొందిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ తన సొంత హబ్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి వెబ్ సిరీస్‌లు , సినిమాల పోస్ట్-ప్రొడక్షన్ పనులు నేరుగా హైదరాబాద్‌లోనే జరగనున్నాయి. ఇది స్థానిక ప్రతిభకు అంతర్జాతీయ వేదికను కల్పిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన IMAGE పాలసీ , రాయదుర్గం వద్ద నిర్మిస్తున్న భారీ ఇమేజ్ టవర్స్ వంటి మౌలిక సదుపాయాలు ఈ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించాయి. ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉండటం, తక్కువ ఖర్చుతో కూడిన నిర్వహణ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు హైదరాబాద్‌ను లాస్ ఏంజెల్స్ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన నగరంగా మారుస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ హబ్ ప్రారంభం ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగనుంది.
రాబోయే రోజుల్లో హాలీవుడ్ , బాలీవుడ్ చిత్రాలకే కాకుండా, రీజనల్ కంటెంట్‌కు కూడా హైదరాబాద్ ప్రధాన కేంద్రం కాబోతోంది. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో హైదరాబాద్‌కున్న ప్రత్యేకతను గుర్తించిన నెట్‌ఫ్లిక్స్, ఇక్కడ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్టూడియోలను నెలకొల్పుతోంది. ఈ పరిణామం వల్ల హైదరాబాద్ కేవలం ఐటీ హబ్‌గానే కాకుండా, డిజిటల్ క్రియేటివ్ ఎకానమీ లో భారతదేశపు నంబర్ వన్ నగరంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుంది.