టి-కాంగ్రెస్ లో అందరూ పల్లకీలోనే..మరి మోసేవాళ్ళేరి?

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. తెలంగాణాలో ఉన్న సీనియర్ నేతలందరికీ దానిలో ఏదో ఒక పదవి పంచిపెట్టేయడంతో ఇంకా బయట ఎవరూ మిగలి లేరనే చెప్పవచ్చు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా తుడిచిపెట్టుకుపోతున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కని మార్చాలని తెలంగాణా కాంగ్రెస్ నేతలు డిమాండ్ ని వారి అధిష్టాన్ పట్టించుకోలేదు. మళ్ళీ వారినే ఆ పదవులలో కొనసాగించింది.

కొత్తగా ఏర్పాటు చేసిన కార్యవర్గంలో మొత్తం 13మంది ఉపాధ్యక్షులు, 31మంది ప్రధాన కార్యదర్శులు, 35 మంది కార్యవర్గ సభ్యులు, 22 మంది శాశ్విత ఆహ్వానితులు, 31 మంది సమన్వయ కమిటీ సభ్యులు, ఒక కోశాధికారిని నియమించింది.

ఉపాధ్యక్షులు: సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, పొన్నం ప్రభాకర్, మళ్ళు రవి, శ్రీధర్ బాబు, బలరాం నాయక, నంది ఎల్లయ్య, జి. ప్రసాద్, నాగయ్య, అబ్దుల్ రసూల్ ఖాన్, కుమార్ రాష్ట్ర విభజన, నరసింహా రెడ్డి, రంగా రెడ్డి.

రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నేతలందరికీ తలో పదవి పంచిపెట్టేసింది కనుక అందరూ పల్లకీలో ఎక్కినట్లే భావించవచ్చు కానీ వాళ్ళని మోసేవాళ్ళే లేరిప్పుడు. అయితే అంతమందికి కార్యవర్గంలో ఎందుకు చోటు కల్పించింది అంటే దానికి చాలా బలమయిన కారణం కనబడుతోంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికని అది చెపుతున్నప్పటికీ పార్టీని వీడి ఎవరూ తెరాసలో చేరిపోకుండా ఆపడానికేనని అర్ధమవుతోంది.

రాష్ట్రంలో తెదేపాను పూర్తిగా తుడిచిపెట్టేసిన తరువాత తెరాస కాంగ్రెస్ పార్టీపై దృష్టి పెట్టింది. ఆ భయంతోనే రాష్ట్రంలో సీనియర్ నేతలందరికీ తలొక పదవీ పంచి పెట్టేసినట్లుంది. ఆ కారణంగా అయినా అందరూ పార్టీని అంటిపెట్టుకొని ఉంటారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లుంది.

పార్టీలో సీనియర్ నేతలందరినీ పార్టీ ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా నియమించడం వెనుక మరో ఉద్దేశ్యం కూడా కనబడుతోంది. ఆ హోదాలో ఉన్నవారు తెరాసలో అంత కంటే తక్కువ హోదా గల ఏ పదవిలో చేరాలన్నా కొంచెం నామోషీగానే ఉంటుంది. తెరాసలో కీలక పదవులన్నిటినీ ఇప్పటికే కాంగ్రెస్, తెదేపాల నుంచి వచ్చినవారు, తెరాస పార్టీ సీనియర్ నేతలు ఆక్రమించుకొని ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ నేతలేవరయినా తెరాసలో చేరాలన్నా అక్కడ ఏ పదవులు ఖాళీ లేవు. కనుక ఏదో ఒక చిన్న పదవితో లేదా అసలు  ఏ పదవీ లేకపోయినా సరిబెట్టుకోవలసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా గౌరవం, ప్రత్యేక గుర్తింపు పొందుతున్నవారు అందుకు సిద్దం కాకపోవచ్చు. బహుశః అదే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో ఉన్న పార్టీ నేతలందరికీ తలో పదవి సృష్టించి అందులో కూర్చోబెట్టేసి చేతులు దులుపుకొంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com