జీఎస్టీ శ్లాబులను సంస్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీపావళి కానుక అని ప్రధాని మోదీ ప్రకటించినప్పటికీ ముందుగానే అమలు చేయబోతున్నారు. ఏయే వస్తువులపై తగ్గుతాయి అన్న జాబితా కూడా విడుదల చేశారు. దీని ప్రకారం ప్రజలకు చాలా వరకూ మేలు జరుగుతుంది. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల భారంతో అల్లాడిపోతున్న వారికి ఎంతో కొంత ఉపశమనం అయితే కలుగుతుంది. లగ్జరీ వస్తువులపై మాత్రం నలభై శాతం పన్ను కొనసాగుతుంది.
మోదీ ముందే ప్రకటించడం వల్ల ముందే అమలు
ఆగస్టు పదిహేను సందర్భంగా ప్రధాని మోదీ దీపావళికి జీఎస్టీ సంస్కరణల గురించి చెప్పారు. వెంటనే కేంద్రం నుంచి లీక్ వచ్చింది. భారీగా జీఎస్టీని తగ్గిస్తున్నారని.. రెండు శ్లాబులే ఉంటాయని అందరికీ తెలిసిపోయింది. దాంతో ప్రజలు కొనుగోళ్లు ఆపేశారు. కార్ల కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోయింది. ఒకటి, రెండు నెలలు ఆగితే.. లక్ష వరకూ మిగులుతుందని భావించారు . ఒక్క సారిగా కొనుగోళ్లు తగ్గిపోవడంతో.. తగ్గించేదేదో ఇప్పుడే తగ్గించాల్సిన అవసరం ఏర్పడింది. దానికి తగ్గట్లుగా జీఎస్టీ నిర్ణయాలు తీసేసుకున్నారు. అమల్లోకి వచ్చిన తర్వాత వినియోగం పెరిగే అవకాశం ఉంది.
ప్రజలకు డబ్బులు ఆదా !
జీఎస్టీ రాక ముందు ఎంఆర్పీల అన్ని పన్నులతో సహా అని అమ్మేవారు. జీఎస్టీ వచ్చాక.. అదే ధర ఉంటుంది.. అదనంగా జీఎస్టీని కలిపి అమ్మడం ప్రారంభించారు. దీంతో ప్రజలు రెండు విధాలుగా దోపిడీకి గురయ్యారు. అదే సమయంలో పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఆరోగ్య బీమాపై పద్దెనిమిది శాతం జీఎస్టీ ఏమిటన్న ప్రశ్నలు వచ్చాయి. చివరికి అన్నింటికీ సమాధానం చెబుతూ జీఎస్టీని సంస్కరించారు. నిత్యావసరాలపై జీఎస్టీని తగ్గించడం వల్ల ప్రతి కుటుంబానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి నెలకు దాదాపుగా రెండు లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం వస్తోంది. అంతే మొత్తం రాష్ట్రాలకు వస్తుంది. ఇలా ప్రజల్ని దోచుకోవడం మంచిది కాదని.. వారిలో తిరుగుబాటు రావొచ్చన్న భావన కారణంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వాలకు ఆదాయం తగ్గదు – వినియోగం పెరుగుతుంది !
జీఎస్టీని సంస్కరించడం వల్ల ప్రజలకు ఆదాయం మిగులుతుంది అంటే.. ప్రభుత్వానికి తగ్గుతుందనే అర్థం. అయితే ఇక్కడ లెక్కలు వేరుగా ఉంటాయి. ప్రభుత్వానికి ఆదాయం తగ్గదు. ఎందుకంటే.. జీఎస్టీని తగ్గించడం వల్ల వినియోగం పెరుగుతుందని ఆర్థికపరమైన లెక్కలు చెబుతున్నాయి. వినియోగం పెరగడం వల్ల .. ఆ ఆదాయం కవర్ అవుతుంది. అందుకే ఈ జీఎస్టీ సంస్కరణలు రెండు విధాలుగా మేలు చేసేవే.