కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బిల్లు .. భారతీయ జనతా పార్టీకి పెనుముప్పుగా మారుతుంది. ఇవాళ కాకపోతే రేపు అయినా సమస్య అవుతుంది. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజలు ఏ ప్రభుత్వాన్ని అయినా కొంతకాలమే భరిస్తారు. తర్వాత మార్పు కోరుకుంటారు. తమకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటారు. బీజేపీకి అలాగే చాన్స్ వచ్చింది. రేపు బీజేపీకి కూడా ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటారు. అందులో సందేహం ఉండదు. అది ఎప్పుడన్నది చెప్పడం కష్టం కానీ.. మార్పు అనేది అనివార్యం.
ఇవాళ కాకపోతే రేపైనా బీజేపీకీ గండమే
మరి అప్పుడు ఏం జరుగుతుంది ?. భారతీయ జనతా పార్టీ తీసుకు వచ్చిన ఈ ఇంపీచ్ మెంట్ బిల్లును అడ్డం పెట్టుకుని.. రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను కూల్చేయడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే చట్టాలు ఉన్నది దుర్వినియోగం చేయడానికే అనుకుంటాయి రాజకీయ పార్టీలు. ఆ చట్టాలు అమలు తమ చేతుల్లో ఉంటే ఎందుకు వదిలి పెడతారు?. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు తమ ప్రభుత్వాలను ఇలా చేసిందని.. తాము మాత్రం ఎందుకు వదిలిపెట్టాలని దూసుకెళ్తారు. ప్రశ్నిస్తే..గతంలో మీరు చేసిందేగా ఉంటారు. అప్పుడు నోరెత్తడానికిప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ ఉండదు.
బెయిల్ వస్తే మళ్లీ పదవి చేపడతారుగా !
అదే సమయంలో భారత న్యాయవ్యవస్థలో ఏ ప్రక్రియ అయినా ఎంత నెమ్మదిగా జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. ఏ నేరస్తుడ్ని అయినా సుదీర్ఘంగా జైల్లో పెట్టడం అసాధ్యం. అది కూడా పవర్ ఫుల్ లీడర్లను జైళ్లలో పెట్టలేరు. విపక్ష నేతలను అయినా సరే. నాలుగైదు నెలల పాటు జైల్లో పెట్టినా.. తర్వాత అయినా బెయిల్ వస్తుంది. అప్పుడు మళ్లీ తన పదవిని తాను పొందడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల ఆ చట్టం ప్రయోజనం కూడా ఒనగూరే అవకాశాల్లేవు. నిజానికి ఏదైనా కేసులో తప్పనిసరిగా అరెస్టు అనే పరిస్థితి వస్తే చాలా మంది నేతలు రాజీనామాలు చేస్తున్నారు. కేజ్రీవాల్ లాంటి వారు మాత్రమే రాజీనామాకు నిరాకరిస్తున్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు ఇలాంటి చట్టం తెస్తే.. అది బీజేపీకి కూడా పెనుగండంగా మారుతుంది.
ఇలాంటి చట్టాలతో భవిష్యత్ లో ఎన్నో సమస్యలు
నేర నిరూపణ కాకుండా శిక్ష విధించడం అనేది మంచిది కాదని ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. భారత రాజకీయాల్లో వ్యవస్థలు.. పోలీసులు.. పాలకుల కనుసన్నల్లో పని చేస్తూంటాయి. అవి విపక్ష నేతలపై వేధింపులకు టూల్స్ గా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో .. బీజేపీ తెచ్చే చట్టం ఖచ్చితంగా దుర్వినియోగం అవుతుంది. ఇందుకే ఇలాంటి చట్టాలతో ఆటలాడటం.. చాలా ప్రమాదకరం అనుకోవచ్చు.