సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతివాడి చేతికి ఓ ఆయుధం దొరికినట్లయింది. ఈ ఆయుధంతో కొందరు అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంటే, ఇంకొందరు దిన్ని ఆయుధంగా చేసుకొని విధ్వంసం సృస్టిస్తున్నారు. సోషల్ మీడియాలో కంటెంట్ కంట్రోల్ వుండదు. ఎవడు ఎలాంటి పోస్ట్ అయినా పెట్టొచ్చు. ఎలాంటి కామెంట్ అయినా కొట్టొచ్చు. యాక్షన్ తీసుకునేవాడు ఎవడూ వుండడు. ఒకవేళ యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తే ఆలోగ జరగాల్సిన నష్టం జరుగుపోతుంది. మిగతా రంగాలపై ఏమో గానీ సినిమా పై మాత్రం దీని ప్రభావం ఎక్కువగా కనబడుతుంది.
సినిమాలకు ఇప్పుడు సోషల్ మీడియా టెర్రర్ పట్టుకుంది. ముఖ్యంగా బడా హీరోల సినిమాలకి. అభిమానం ముసుగులో ఉగ్రవాదం చూపిస్తున్నారు కొందరు. పెద్ద సినిమా వస్తుందంటే భయం. పనికిమాలిన పోస్టులు పెట్టి చిత్రవధ చేస్తుంటారు. అవతలి హీరో సినిమాపై బురద జల్లి అనవసరమైన వివాదాల్ని సృష్టిస్తుంటారు. చాల దారుణమైన పోస్టులతో నీచానికిదిగుతారు. దీంతో తమ హీరోపై అభిమానం చాటుకుంటున్నామని వారి లెక్క. ఇక మరో హీరో సినిమా వచ్చినపుడు వీళ్ళు ఇదే పద్ధతి అనుసరిస్తారు. ఈ ట్రెండ్ టాలీవుడ్ లో ఎక్కువ కనిపిస్తుంది. మహేష్ బాబు- పవన్ కళ్యాణ్ – ఎన్టీఆర్- ప్రభాస్.. ఇలా స్టార్ హీరోల సినిమాలపై సోషల్ మీడియా వేదికగా ఎలాంటి రచ్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలియదుగానీ.. అభిమానం ముసుగులో సదరు హీరోల ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారు కొందరు.
ఇప్పుడు చిరంజీవి సినిమా థియేటర్ లోకి వచ్చింది. దాదాపు పదేళ్ళ తర్వాత మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చిన చిత్రమిది. టాక్ పాజిటీవ్ గా వుంది. అయితే ఇపుడు ఈ సినిమాపై కూడా సోషల్ మీడియాలో చాలా డ్యామేజీ జరిగిపోతుంది. కరెక్ట్ గా మానిటర్ చేయాలి గానీ ఈ సినిమా మొత్తం పేస్ బుక్, ట్విట్టర్ లో కనబడుతుంది. చిరంజీవి ఎంట్రీ వీడియో అంట, ఫస్ట్ ఫైట్ అంట, అమ్మడు కుమ్మడు సాంగ్ అంట, ఇంటర్ వెల్ బ్యాంగ్ అంట, చిరంజీవి ఎమోషనల్ సీన్ అంట, రత్తాలు సాంగ్ లో చిరు మాస్ డ్యాన్స్ అంట, సుందరి సాంగ్ అంట, కాయిన్ ఫైట్ అంట, కైమాక్స్ యాక్షన్ సీన్ అంట.. ఇలా సినిమాలోని కీలకమైన సన్నివేశాలన్నీ సదరు అభిమానుల ట్విట్టర్ పేస్ బుక్ లలో దర్శనమిస్తున్నాయి.
సినిమా వచ్చి ఒక రోజు కూడా ఇంకా పూర్తికాలేదు. అప్పుడే సినిమాలోని కంటెంట్ ఇలా సోషల్ మీడియాకి ఎక్కడం ఎంత దారుణం. నిజంగా ఇది అభిమానం చూపిస్తున్నట్లు కాదు. సినిమాని చంపేస్తున్నట్లు. ఇలాంటి అభిమానం హీరోలు కోరుకోరు. సినిమా అనేది ఒక థియేటిరికల్ ఎక్సపీరియన్స్. ఎంతో వ్యయ ప్రయాసలతో వెండితెరపైకి వస్తుంది సినిమా. అలాంటిది సినిమా విడుదలై ఒక పుట కూడా గడవకుండానే ఇలా వీడియోలు తీసి ఇంటర్ నెల్ లో పెట్టడం ఏం అభిమానం అనిపించుకుంటుంది. ఇది అభిమానం కాదు.. ఖచ్చితంగా సినిమాని చంపేయడమే.