ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారుతున్నప్పుడల్లా భూముల రికార్డులు, పాస్ పుస్తకాల రూపకల్పన వివాదాస్పదంగా మారుతోంది. గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే ప్రక్రియలో భారీగా తప్పులు దొర్లాయి. జగన్ ఫోటోతో పనికి రాని పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ తప్పు సరి చేయడానికి ఏపీ ప్రభుత్వం మళ్లీ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తోంది. అయితే జగన్ ఫోటోతో పాస్ పుస్తకం పోయింది…రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తున్నారు కానీ ఆ ప్రభుత్వంలో చేసిన తప్పులు అలాగే ఉన్నాయి. ఇవన్నీ జగన్ చేసిన తప్పులేదని మంత్రి అనగాని అంటున్నారు. ఆ ప్రభుత్వం తప్పులు చేస్తే దిద్ది ఇవ్వాలి కానీ అదే తప్పులు .. ఇవన్నీ జగన్ చేసిన తప్పులే అంటే ఎలా?
తప్పులు దిద్దాల్సిన పని లేదా ?
జగన్ హయాంలో రికార్డులను అస్తవ్యస్తం చేశారని, దాని వల్ల లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రభుత్వాలు మారినప్పుడు గత పాలనలోని లోపాలను ఎండగట్టడం సహజమే. కానీ, అధికారం చేతిలో ఉన్నప్పుడు కేవలం నిందలతో సరిపెట్టడం బాధ్యతాయుతమైన ప్రభుత్వం అనిపించుకోదు. జగన్ హయాంలో తప్పులు జరిగాయని భావిస్తే, వాటిని సరిదిద్దేందుకు అవసరమైన శాస్త్రీయ మార్గాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. వారు తప్పు చేశారు కాబట్టి ఇవన్నీ ఇలాగే ఉంటాయి అనే ధోరణి రైతులకు ఏమాత్రం ఊరటనివ్వదు. పాత ప్రభుత్వంపై నిందలు వేయడం కంటే, తప్పులు లేని రికార్డులను రైతులకు అందించడమే ప్రస్తుత ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం కావాలి.
వ్యవస్థాగత వైఫల్యమా? పర్యవేక్షణ లోపమా?
పాస్ పుస్తకాల్లో పేర్లు తప్పుగా పడటం, విస్తీర్ణంలో తేడాలు రావడం వంటివి క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణ లోపాన్ని సూచిస్తున్నాయి. డేటా ఎంట్రీలో తప్పులు జరిగినప్పుడు వాటిని సరిచూసే వ్యవస్థ లేకపోవడం పెద్ద మైనస్. గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన డిజిటల్ రికార్డుల్లో లోపాలు ఉన్నాయని తెలిసినప్పుడు, కొత్త పాస్ పుస్తకాలను ముద్రించే ముందే ఒకసారి వెరిఫికేషన్ డ్రైవ్ నిర్వహించి ఉంటే ఈ గందరగోళం ఉండేది కాదు. సమస్య మూలాల్లోకి వెళ్లకుండా పంపిణీపైనే దృష్టి పెట్టడం వల్ల ఇప్పుడు ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ప్రభుత్వ బాధ్యత – రైతు ఆవేదన
రైతుకు తన భూమి ప్రాణం లాంటిది. పాస్ పుస్తకంలో చిన్న తప్పు ఉన్నా బ్యాంక్ రుణాలు రావు, భూమి క్రయవిక్రయాల్లో చిక్కులు వస్తాయి. కాబట్టి, ప్రభుత్వం తన వాదనను కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం చేయకుండా, ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి తప్పులను అక్కడికక్కడే సరిదిద్దాలి. గత పాలకుల వైఫల్యాలను ప్రజలకు వివరించడం రాజకీయ వ్యూహం కావచ్చు, కానీ వ్యవస్థలను ప్రక్షాళన చేసి తప్పుల్లేని పాస్ పుస్తకాలు ఇవ్వడం పరిపాలనా బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినప్పుడే ప్రభుత్వానికి నిజమైన గుర్తింపు వస్తుంది.
