జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పాత మహిళా ఫైర్ బ్రాండ్లపై విరక్తితో ఉన్నారు. వారి అవసరం ఇక పార్టీకి లేదనుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీలో రైజింగ్ స్టార్ శ్యామల మాత్రమే. ఆమె కూకట్ పల్లిలో ధర్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డికి అద్భుతంగా అనిపిస్తోందని వైసీపీ వర్గాలంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఎక్కడో చోట టిక్కెట్ ఇచ్చేస్తారని అనుకుంటున్నారు. ఇస్తే ఇచ్చుకున్నారు అని వైసీపీ నేతలు సర్దుకుపోలేకపోవడానికి కారణాలు ఉన్నాయి.. అదేమిటంటే.. ఇప్పటి వరకూ ఫైర్ బ్రాండ్లుగా ఉన్న రోజా, రజనీలను జగన్ పక్కన పెట్టేస్తున్నారు.
నగరి ఇక రోజాది కాదు!
నగరి నియోజకవర్గం ఇక రోజాది కాదని వైసీపీ వర్గాలంటున్నాయి. ఆమెను అసలు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఉంచరని చెబుతున్నారు. త్వరలో నగరి నియోజకవర్గానికి కొత్త ఇంచార్జ్ రాబోతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రోజా పట్ల ఏ మాత్రం సానుకూలంగా లేరు. భూమన కరుణాకర్ రెడ్డి మాత్రమే రోజాకు సపోర్టుగా ఉన్నారు. కానీ ఆయన నగరి సీటును రోజా కోసం అట్టిపెట్టేంత చొరవ తీసుకోలేరు. ఈ విషయం రోజాకు స్పష్టత రావడంతో మెల్లగా తమిళ సినిమాల్లో అవకాశాలు వెదుక్కుంటున్నారు. నగరి ఇంచార్జ్ గా తనను తీసేసిన తర్వాత ఆమె భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటారు.
రజనీని పొమ్మనలేక పొగ పెడుతున్న జగన్
విడదల రజనీని పొమ్మనలేక జగన్ పొగ పెడుతున్నారు. గుంటూరు పంపి బలిపశువును చేయడమే కాకుండా ఇప్పుడు రేపల్లెకు పోవాలంటున్నారు. తాను చిలుకలూరిపేటలోనే ఉంటానని ఆమె అంటున్నారు. కావాలంటే పార్టీ మారుతానని ప్రచారం చేయించుకున్నారు. ఏ ఇతర పార్టీలు ఆహ్వానించే పరిస్థితి లేదు. పార్టీ మారొద్దు చిలుకలూరిపేట నీదేనని అంటారని ఆమె అనుకున్నారు. సజ్జల అలా ప్లాన్ చేసి ఉంటారు. కానీ జగన్ మాత్రం రజనీకి పొమ్మనలేక పొగ పెట్టారని మనసు మార్చుకునే అవకాశం లేదని అంటున్నారు. అందుకే విడదల రజనీ ఈ సారి కొత్తగా ప్రయత్నించారు. భారతి వైపు నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ లేని విధంగా చిటికెలు వేసి శుభాకాంక్షలు చెప్పారు. ఆమె ప్రయత్నాలు ఫలించకపోవచ్చని.. ఎందుకంటే జగన్ ఆమెను వద్దనుకుంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
శ్యామలకు చిలుకలూరిపేట ఇస్తారా?
జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు శ్యామల పై అభిమానం చూపిస్తున్నారు. పవన్ కల్యాణ్ ను బాగా ట్రోల్ చేస్తోందని ఆయన ఫీడ్ బ్యాక్ ఇస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమెను మరింత ప్రోత్సహిస్తారని అంటున్నారు. ఈ ప్రోత్సాహం కొనసాగితే చిలుకలూరిపేటకు ఆమె అభ్యర్థి కావొచ్చని అంటున్నారు. అందుకే విడదల రజనీని రేపల్లే అంటున్నారని…. చెబుతున్నారు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఫైర్ బ్రాండ్ మహిళా నేతల వద్దఇక రాజకీయం లేదని డిసైడయిపోయారు.
