తెలంగాణ ప్రభుత్వం చెరువులు, నాలాలు , నదుల పరివాహక ప్రాంతాల రక్షణ కోసం బిల్డింగ్ రూల్స్’లో కీలక మార్పులు చేస్తూ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ విధానాన్ని హేతుబద్ధీకరించింది. గతంలో మాదిరిగా అందరికీ ఒకే రకమైన టిడిఆర్ ఇచ్చే పద్ధతికి స్వస్తి పలికి, ఇప్పుడు భూమి స్వభావం ప్రాంతాన్ని బట్టి టిడిఆర్ పరిమాణాన్ని వర్గీకరించాలని నిర్ణయించింది. సుప్రీం కోర్టు, హైకోర్టు , ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తూనే, భూ యజమానుల ప్రయోజనాలను కాపాడటం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశ్యం.
టీడీఆర్ అంటే సులభంగా చెప్పాలంటే, ఒక వ్యక్తికి చెందిన భూమిని ప్రభుత్వం పబ్లిక్ అవసరాల కోసం సేకరించినప్పుడు, దానికి నగదు రూపంలో పరిహారం ఇచ్చే బదులు.. దానికి బదులుగా ఇచ్చే అదనపు నిర్మాణ అనుమతి పత్రం . ఉదాహరణకు, మీ భూమిలో మీరు కట్టుకోలేకపోయిన అంతస్తులను లేదా వైశాల్యాన్ని, టీడీఆర్ సర్టిఫికేట్ రూపంలో పొంది.. దానిని నగరం లోని ఇతర ప్రాంతాల్లో మీ సొంత భవన నిర్మాణానికి అదనపు అంతస్తుల కోసం వాడుకోవచ్చు లేదా అవసరమైన బిల్డర్లకు మార్కెట్ ధరకు అమ్ముకోవచ్చు. ఇది భూమిని కోల్పోయిన యజమానికి ఆర్థికంగా నష్టం కలగకుండా ప్రభుత్వం ఇచ్చే ఒక రకమైన క్రెడిట్ లాంటిది.
ఈ నూతన విధానం ద్వారా ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణను, పట్టణ అభివృద్ధిని సమతుల్యం చేస్తోంది. నీటి వనరుల ఆక్రమణలను అరికట్టడానికి భూ యజమానులు స్వచ్ఛందంగా తమ పట్టా భూములను ప్రభుత్వానికి అప్పగించేలా ఈ రెగ్యులేటరీ ఇన్సెంటివ్ ఉపయోగపడనుంది. బఫర్ జోన్లలో ఉన్న భూములకు ఇచ్చే టిడిఆర్ విషయంలో స్పష్టమైన నిబంధనలు తీసుకురావడం వల్ల, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడటమే కాకుండా, నిజమైన భూ యజమానులకు తగిన నష్టపరిహారం లేదా ప్రత్యామ్నాయ ప్రయోజనాలు లభిస్తాయి.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరియు పట్టణ ప్రణాళికా రంగంలో ఇది ఒక చారిత్రాత్మక మార్పుగా పరిగణించవచ్చు. కేవలం భూమిని సేకరించడమే కాకుండా, పర్యావరణ సమతుల్యతను కాపాడే క్రమంలో భూ యజమానులకు ఆర్థికంగా నష్టం కలగకుండా ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను రూపొందించింది. ఇది భవిష్యత్తులో హైదరాబాద్‌ను ఒక స్థిరమైన నగరంగా తీర్చిదిద్దడానికి మరియు వరదల వంటి విపత్తుల నుండి రక్షణ కల్పించడానికి బలమైన పునాదిగా నిలుస్తుంది.
