టీచర్ కావాలనుకుంటున్న వారి కలలను నిజం చేస్తూ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ ఎంపిక ప్రక్రియ పూర్తి అయింది. 16,347 మంది కొత్త టీచర్లను.. వారి కుటుంబసభ్యులతో సహా ఆనందాన్ని పంచుకుంటూ ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని గురువారం వేడుకగా నిర్వహిస్తున్నారు. సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన వేదిక వద్ద గురువారం జరగనున్న ఈ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరు కానున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకూ ఆహ్వానం పంపారు. జగన్ కు కూడా ఆహ్వానం పంపారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు నాయుడు మొదటి సంతకం డీఎస్సీ ఫైల్ మీదనే చేశారు. నోటిఫికేషన్ ఇచ్చాక.. వైసీపీ ఈ ప్రక్రియను ఆపేయడానికి చేయని ప్రయత్నాలు లేవు. వందకుపైగా పిటిషన్లను కోర్టుల్లోవేసింది. కానీ ఎక్కడా వారి ప్రయత్నాలు ఫలించలేదు. దాదాపుగా ఆరు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసిన ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ సజావుగా పూర్తయింది.
నిజానికి సెప్టెంబర్ 19నే ఈ నియామకపత్రాల అందజేత కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ వర్షాల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటీవలి కాలంలో ఇంత భారీ నియామకాలు చేపట్టలేదు. వైసీపీ హయాంలో మెగా డీఎస్సీ ఇస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగుల్ని మోసం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే హామీని అమలు చేసింది. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ ప్రకటించారు.


