రాష్ట్రపతి కుమార్తె షర్మిష్ఠ ముఖర్జీకి సైతం ఆకతాయిల వేధింపులు తప్పకపోవడం చాలా విస్మయం కలిగించే విషయమే. పశ్చిమ బెంగాల్ కి చెందిన పార్దా మండల్ అనే వ్యక్తి షర్మిష్ఠ ముఖర్జీకి అసభ్యకరమైన మెసేజులు పంపేడు. సాక్షాత్ రాష్ట్రపతి కుమార్తె అయిన ఆమె కూడా దేశంలో ఒక సామాన్య యువతి ఎదుర్కొనే కష్టాలు ఎదుర్కోవలసి రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఈ సంఘటన దేశంలో మహిళల పరిస్థితికి అద్దం పట్టింది. ఆమె తన తండ్రి, కుటుంబ పరువు ప్రతిష్టల గురించి మాత్రమే ఆలోచించి ఉండి ఉంటే ఈ విషయం లోకానికి తెలిపేవారే కారు. కానీ దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న ఈ సమస్య గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఫేస్ బుక్ లో ఆ వివరాలు పెట్టారు. ఊహించినట్లుగానే అదొక సంచలన వార్త అయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తుండగా, ఈ కేసులో ఊహించని మలుపు వచ్చింది.
నిందితుడు తండ్రి ఫేస్ బుక్ ద్వారానే క్షమాపణలు కోరుతూ రాష్ట్రపతి కుమార్తెకి ఒక మెసేజ్ పెట్టారు. అందులో తన కుమారుడు ఒక మానసిక రోగి అని, ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నామని కనుక ఆతనిని క్షమించవలసిందిగా వేడుకొన్నారు. ఇది ఊహించని మలుపే. కానీ షర్మిష్ట ముఖర్జీ కూడా ఊహించని సమాధానమే ఇచ్చారు. అతనిని ముందు పోలీసులకి లొంగిపొమ్మని కోరారు. అతను నిజంగా మానసిక రోగా కాదా అనే విషయం వారే వైద్యుల చేత పరీక్ష చేయించి తెలుసుకొంటారని ఆమె సమాధానం చెప్పారు. ఆమె చాలా సముచితంగానే స్పందించారని చెప్పవచ్చు. అయినా పరిస్థితి ఇంతవరకు వచ్చిన తరువాత ఇంతకంటే వేరే గత్యంతరం లేదు కూడా. ఒకవేళ అతను మానసిక రోగి అని తేలితే సరైన చికిత్స లభిస్తుంది. అటువంటి సమస్య ఏదీ లేదని తేలితే జైలుకి వెళ్ళక తప్పదు. అదే సరైనా శిక్ష. దేశంలో చాలా మంది మహిళలు ఇటువంటి సమస్యలు నిత్యం ఎదుర్కొంటూనే ఉంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే షర్మిష్ఠ ముఖర్జీలాగ నిందితులని లోకం ముందు నిలబెడుతుంటారు. అటువంటివారి భరతం పట్టడానికి చాలా కటినమైన నిర్భయ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ దేశంలో ఇటువంటి నేరాలు, అత్యాచారాలు ఏమాత్రం తగ్గకపోగా ఇంకా పెరుగుతూనే ఉండటం చాలా ఆందోళన కలిగించే విషయమే. రాష్ట్రపతి కుమార్తె షర్మిష్ఠ ముఖర్జీకి ఎదురైనా ఈ చేదు అనుభవం తరువాతైన మోడీ ప్రభుత్వం ఈ సమస్యకి తగిన పరిష్కారం కనుగొనాలి.