విజయవాడ నగరాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసే దిశగా గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనను నిజం చేసేందుకు ప్రజాప్రతినిధులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నేతృత్వంలోని బృందం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి, ఈ మేరకు సమగ్ర నివేదికను అందజేసింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌పై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంతో, బెజవాడ రూపురేఖలు మారబోతున్నాయనే ఆశలు చిగురించాయి.
విజయవాడ పరిసరాల్లోని 74 గ్రామాలను విలీనం చేస్తూ గ్రేటర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం ఈ ప్రతిపాదనలోని ప్రధానాంశం. దీనివల్ల పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌లు, పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. నగరం విస్తరించడం ద్వారా కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయని ఆశాబావంతో ఉన్నారు.
ప్రస్తుతం విజయవాడ నగరం ఎన్టీఆర్ , కృష్ణా జిల్లాల మధ్య విస్తరించి ఉంది. దీని వల్ల పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పోలీస్ యంత్రాంగం, రవాణా శాఖ, శాంతిభద్రతల పర్యవేక్షణ , విమానాశ్రయ ప్రోటోకాల్ వంటి విషయాల్లో రెండు జిల్లాల అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. గ్రేటర్ విజయవాడ ఏర్పాటుతో ఈ విభజన సమస్యలు తొలగిపోయి, మొత్తం నగరం ఒకే పరిపాలన కిందకు వస్తుందని, ఇది పౌర సేవలను మరింత వేగవంతం చేస్తుందని నివేదికలు ఇప్పటికే రెడీ అయ్యాయి.
శివారు గ్రామాలు విలీనం కావడంతో, ప్రణాళికాబద్ధమైన డ్రైనేజీ వ్యవస్థను నిర్మించడానికి , కృష్ణా నది జలాలను శాస్త్రీయంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారాల కోసం భారీ ప్రాజెక్టులను చేపట్టేందుకు గ్రేటర్ హోదా ద్వారా కేంద్ర , రాష్ట్ర నిధులు అధిక మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుంది. మరో ఏడాదిలో అయినా విజయవాడను గ్రేటర్ గా మార్చాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మారితే బెజవాడ విస్తరించడం ఖాయమని అనుకోవచ్చు.
