జమ్మూ కాశ్మీర్ లోని పహల్గంలో జరిగిన ఉగ్రదాడిలో సుమారు 28మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఉగ్రదాడిలో ఓ నవవధువు తన భర్తను ముష్కరుల దాడిలో కోల్పోవడంతో అతడి శవం వద్ద ఆమె రోదిస్తూ ఉండే ఫోటో యావత్ దేశాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది.
కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి లో హనీమూన్ కోసం వెళ్లిన కొత్త జంట జీవితాన్ని చిదిమేశారు. హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ రెండేళ్ల క్రితం నేవీలో చేరాడు. ఈ ఏడాది ఏప్రిల్ 16 వివాహ బంధంలోకి అడుగు పెట్టగా.. అనంతరం తన భార్యను తీసుకొని కశ్మీర్ కు హనీమూన్ కోసం వెళ్లారు. ఆహ్లాదంగా సాగుతూన్న ఈ ట్రిప్ ఒక్కసారిగా విషాదంగా మారింది. జీవితంపై ఎన్నో కలలు.. మరెన్నో అంచనాలు పెట్టుకున్న ఆ జంటను ఉగ్రభూతం విడదీసింది. ఉగ్రమూకలు పాయింట్ బ్లాక్ లో పెట్టి వినయ్ ను కాల్చి చంపారు. తన కళ్ళముందటే ప్రాణాలు కోల్పోవడం చూసి ఆ నవ వధువు భర్త శవం వద్ద గుండెలవిసేలా రోదించింది. ఈ ఫోటో ఎంతోమందిని భావోద్వేగానికి గురి చేస్తోంది.
మరో జంటది కూడా అదే పరిస్థితి. యూపీకి చెందిన శుభం ద్వివేదికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహం అయింది. పెళ్లి తర్వాత జాబ్ లో బిజీ కావడంతో.. ఇటీవల తన భార్యను వెంటబెట్టుకొని కశ్మీర్ కు వెకేషన్ కోసం వెళ్లారు. ఈ క్రమంలో.. వారు విహరిస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన ముష్కరులు తన భర్త తలపై కాల్చి చంపినట్లు అతని భార్య పేర్కొన్నారు. ప్రశాంత , ఆహ్లాదకరమైన వాతావరణంలో కొత్త దాంపత్య జీవితాన్ని ప్రారంభించాలని వచ్చిన రెండు జంటల జీవితం.. తలకిందులు అయింది. ఉగ్రభూతం ఆ జంటలను ఆశలను బలితీసుకుంది.