భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్రమోడీ.. నరేంద్ర మోడీ అంటే భారతీయ జనతా పార్టీ. ఇది ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోక ముందు వరకే. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. మోడీకి వ్యతిరేకంగా… బీజేపీలోనే వాయిస్‌లు వినిపిస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలంటే ప్రధాని నరేంద్ర మోదీని తప్పించి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లాలని మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత, రైతు ఉద్యమకారునిగా పేరు తెచ్చుకున్న కిషోర్‌తివారీ బహిరంగంగా డిమాండ్ సంచలనం సృష్టించారు.మోడీని తప్పించాలని డిమాండ్ చేస్తూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్‌భగవత్, ప్రధాన కార్యదర్శి భయ్యాజీ సురేష్‌జోషిలకు లేఖ కూడా రాశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని విజయతీరాలకు చేర్చేందుకు పార్టీ పగ్గాలను నితిన్‌గడ్కరీకి అప్పగించాలనేది రాయన డిమాండ్.
అశోక్ తివారీ.. తనంతట తానుగా ఈ మాటలన్నారని ఎవరూ అనుకోవడం లేదు. ఆయన ఆరెస్సెస్ వర్గాలకు సన్నిహితుడు. ఆరెస్సెస్ కు బీజేపీలో అత్యంత ఇష్టమైన నేత గడ్కరీ. పడిపోతున్న మోదీ పాపులారిటీ ప్రభావం.. బీజేపీపై పడకుండా ఉంటే… నితిన్ గడ్కరీని తెర మీదకు తీసుకు రావడమే మంచిదన్న ఆభిప్రాయం ఆరెస్సెస్ వర్గాల్లో ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. బీజేపీ ఫేస్.. మోదీ ఒక్కరే కాదని చెప్పడానికి ఆరెస్సెస్ వ్యూహం ప్రకారం బయటకు వస్తున్నారని అంటున్నారు. గడ్కరీ పార్టీలో.. మోదీ , షాల కన్నా చాలా సీనియర్. ఇప్పుడు బీజేపీలో గడ్కరీ ప్రాధాన్యం తక్కువ. కానీ బీజేపీని శాసించే ఆరెస్సెస్ లో మాత్రం చాలా ఎక్కువ. అందుకే.. గడ్కరీ మళ్లీ తెరపైకి వస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ సాధించడం అసాధ్యమని రాజకీయవాతావరణం స్పష్టత నిస్తోంది. మోదీ, షాల నీడ బీజేపీకి ఎంత దూరంగా ఉంటేనే.. మిత్రపక్షాలు అంత దగ్గర అవుతాయి. లేకపోతే.. ఇష్టం లేకపోయినా.. కాంగ్రెస్ పార్టీ దగ్గరకే వెళ్తాయి. బీజేపీ దగ్గరకు రావు. అందుకే ఆరెస్సెస్ వర్గాలు… ఇప్పటి నుంచి మోదీ, షాల ప్రభావం తగ్గించి.. వారిపై పార్టీలో అసంతృప్తుల్ని ఎగదోస్తే.. వచ్చే ఎన్నికల నాటికి అనుకున్న విధంగా… గడ్కరీని తెర మీదకు తీసుకు రావొచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే.. మోదీ నాయకత్వంపై నిరసనలు ప్రారంభమయ్యాయనే మాట వినిపిస్తోంది. ఇదే నిజం అయితే.. మోదీ, షాలకు వ్యతిరేకంగా మరిన్ని గళాలు గట్టిగానే వినిపించబోతున్నాయి. మోడీకి బీజేపీలోనే ప్రత్యామ్నాయ నేత ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.