రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే అత్యంత కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఇప్పుడు ప్రయాణికుల సహనానికి పరీక్షగా మారింది. దశాబ్దాలుగా వినిపిస్తున్న ఆరు వరుసల విస్తరణ డిమాండ్ కాగితాలకే పరిమితం కావడంతో, ప్రతిఏటా సంక్రాంతి వంటి పండుగ సమయాల్లో ఈ రోడ్డు నరకాన్ని తలపిస్తోంది. వాహనాల రద్దీ అంచనాలను మించిపోతున్నా, విస్తరణ పనుల్లో జరుగుతున్న జాప్యం వల్ల సాధారణ రోజుల్లో గంటలో చేరుకునే దూరం, పండుగ పూట 4 నుంచి 5 గంటల సమయం తీసుకుంటోంది. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఈ రహదారిపై ప్రయాణించాలన్నా ముందే స్లాట్స్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
ప్రస్తుత సంక్రాంతి సీజన్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కేవలం శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం లోపే పంతంగి టోల్ ప్లాజా మీదుగా సుమారు 70,000 వాహనాలు ఏపీ వైపు వెళ్లాయంటే రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడం, నందిగామ వంటి ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించిపోతోంది. ప్రభుత్వం తాత్కాలికంగా అదనపు టోల్ బూత్లు ఏర్పాటు చేసినా, మూల కారణమైన రహదారి విస్తరణ జరగనంత కాలం ఈ కష్టాలు తప్పవని స్పష్టమవుతోంది.
వాస్తవానికి, ఈ రహదారిని ఆరు వరుసలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 10,391 కోట్లతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, భూసేకరణ , డీపీఆర్ ప్రక్రియల వంకతో పనులు వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, 2026 ఫిబ్రవరి లేదా 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యే వరకు ప్రయాణికులకు ఈ ట్రాఫిక్ తిప్పలు, ప్రమాదాల భయం తప్పవు.
