కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, లవ్, థ్రిల్లర్, హారర్, ఫ్యాక్షన్, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ, పొలిటికల్ డ్రామా, స్పోర్ట్స్ డ్రామా.. ఇలా సినిమాల్లో రకరకాల జోనర్లు. ఇప్పుడు కొత్తగా నిబ్బా.. నిబ్బీ జోనర్ కూడా కనిపెట్టారు. ఇంటర్, డిగ్రీ.. మధ్య గ్రూప్ లో ఉండే జనరేషన్‌కి నచ్చే కథలన్నమాట. వాళ్లకు కథ అవసరం లేదు, లాజిక్కులు పట్టించుకోరు, కాన్ఫ్లిక్ట్ అడగరు.. అన్నది రూపకర్తల ధీమా. అలాంటి జనరేషన్‌కు క్యాటర్ చేయడానికంటూ కొన్ని కథలు రెడీ చేసుకొంటున్నారు. అలాంటి కథలకు.. ‘లిటిల్ హార్ట్స్’ అనే సినిమా ఒక పెద్ద ఉదాహరణగా నిలిచింది. కేవలం 3 కోట్లతో వచ్చిన ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాల్ని తీసుకొచ్చింది. ఈ స్ఫూర్తితో టాలీవుడ్ లో 20 కొత్త సినిమాలు పట్టాలెక్కాయి. చాలామంది కొత్త వాళ్లు దర్శకులుగా, హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పుడు వచ్చిన ‘కే..ర్యాంప్’ రూపకర్తలు కూడా ‘మాది నిబ్బా..నిబ్బీ స్టోరీనే’ అని ధైర్యంగా చెప్పుకొంటున్నారు. జనరల్ ఆడియన్స్, రివ్యూవర్స్‌కి నచ్చని సినిమాల్ని కూడా నిబ్బా నిబ్బీ జనరేషన్ ముందుకు తీసుకెళ్తారన్నది వాళ్ల ధీమా.
సినిమాలకు వచ్చే ఆడియన్స్ లో ఇంటర్ – డిగ్రీ మధ్య గ్రూప్‌లో ఉన్న జనరేషన్ ది 50 శాతం ఆక్యుపెన్సీ. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకూ తావు లేదు. వాళ్లని థియేటర్లకు రప్పిస్తే మినిమం గ్యారెంటీ ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు. ఒకవేళ వాళ్లకు సినిమా నచ్చితే రిపీట్ మోడ్ లో చూడ్డానికి కూడా సిద్ధం అవుతారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ కి తీసుకొస్తారు. పబ్లిసిటీ గురించి కూడా బెంగ పడాల్సిన పని లేదు. అందుకే ఈ తరహా కథలు తయారవుతున్నాయి. ఓరకంగా ‘ఆర్.ఎక్స్ 100’, ‘బేబీ’ కూడా ఇలాంటి సినిమాలే. కానీ వాళ్లు చెప్పుకోలేదంతే. ఇప్పటి వాళ్లు మాత్రం `మాది నిబ్బా.. నిబ్బీ స్టోరీనే` అని ధైర్యంగా ప్రకటించుకొంటున్నారు. దీని వల్ల సినిమాకు ఎంత మేలు, ఎంత కీడు అనేది పక్కన పెడితే.. ఓ రకమైన కథలు ఎక్కువగా తయారు కావడానికి, కొత్త నిర్మాతలు.. దర్శకులు సేఫ్ గేమ్ ఆడుకోవడానికి ఓ జోనర్ దొరికినట్టైంది. లవ్ స్టోరీలూ, యూత్ ఫుల్ కథలూ ఇంకొన్ని కొత్తగా పుట్టుకొచ్చే అవకాశం కలిగింది. ఈ జోనర్లో తీసిన సినిమాలన్నీ ఆడేస్తాయని కాదు. కాకపోతే… మినిమం బడ్జెట్ లో ఓ సినిమా తీయడానికి ఒకరమైన స్ఫూర్తి ఇస్తాయనడంలో సందేహం లేదు. యూత్ ని ఆకట్టుకోవాలని అర్థం పర్థం లేని కథలు తీస్తే.. వాళ్లు కూడా నిర్మొహమాటంగా తిరస్కరిస్తారు. లాజిక్స్ లాగని, కథ, స్టార్ బలం పట్టించుకోని ఈ జనరేషన్.. ఓటీటీ ప్రపంచానికి అతి దగ్గరగా ఉందని, వరల్డ్ సినిమాని వాళ్లు ఒక కంట కనిపెడుతూనే ఉంటారన్న విషయం మర్చిపోకూడదు.