నిఖిల్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇది స్వామి రారా కి సీక్వెల్ అని చెప్పుకొన్నారంతా. కానీ అదేం కాదట. స్వామి రారాకీ ఈ కథకీ ఎలాంటి సంబంధం లేదట. ఈ విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. స్వామి రారా ఓ క్రైమ్ కామెడీ కథ అయితే… ఇదో రివైంజ్ డ్రామా అట. అయితే అందులోనూ ఓ ప్రేమకథ మిక్స్ చేశార్ట. ఆదివారం హైదరాబాద్లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. సెప్టెంబరు 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలెడతారు. ఈ సందర్భంగా దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ – ”రివెంజ్ డ్రామా స్టోరీ ఇది. నిఖిల్ కొత్త క్యారెక్టర్లో కనిపిస్తాడు. రివెంజ్ డ్రామాలో లవ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. షూటింగ్ అంతా కాకినాడ నుంచి విశాఖ వరకూ ఉన్న సముద్రతీర ప్రాంతంలో జరుపుతాం” అన్నారు. రావు రమేష్ కీలక పాత్రలో కనిపిస్తారు. త్వరలో టైటిల్, ఇతర టెక్నీషియన్ల వివరాలు ప్రకటిస్తారు. వచ్చే యేడాది ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. స్వామి రారాతో క్రైమ్ కామెడీల హవా నడిచింది. ఇప్పుడు ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తారో చూడాలి.