వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నిఖిల్. తన కాన్సెప్టూ, అందుకోసం అతని పడే కమిట్మెంటూ భేషుగ్గా ఉంటాయి. కొంతకాలంగా కొత్త కథలకు నిఖిల్ కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడు. స్వామి రారా, కార్తి కేయ, సూర్య వర్సెస్ సూర్య ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టాడు. అయితే శంకరాభరణం సినిమా దెబ్బకొట్టేసింది. గంపెడాశలతో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. ఇప్పుడు నిఖిల్ నుంచి మరో సినిమా వస్తోంది. అదే… ఎక్కడికిపోతావు చిన్నవాడా?. ఈ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిఖిల్‌తో తెలుగు 360.కామ్ చేసిన చిట్ చాట్.
హాయ్ నిఖిల్…
హాయ్..
నోట్ల రద్దు దేశాన్ని ఓ కుదుపు కుదిపేస్తోంది. ఈ దశలో సినిమా రిలీజ్ చేస్తున్నారు… టెన్షన్ లేదా?
లోలోపల కొంచెం ఉంది. ప్రతీ సినిమాకీ ఇలానే టెన్షన్ పడుతుంటా. అయితే ఈ సినిమాకి ఇంకొంచెం ఎక్కువైంది. మోడీ తీసుకొన్న నిర్ణయాన్ని సమర్థిస్తా. చాలా గొప్ప ఆలోచన. అయితే గత వారానితో పోలిస్తే.. ఈవారానికి ప్రజల ఇబ్బందులు కాస్త తగ్గాయనే అనిపిస్తోంది. ఏటీఎమ్ సెంటర్ల దగ్గర క్యూ రోజు రోజుకీ తగ్గుతోంది. పైగా సినిమా అనేది చవకైన వినోద మాథ్యమం. రూ.50 ఉంటే సినిమా చూసేయొచ్చు. కాబట్టి.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే ఆశ.
ఈ సినిమా చిత్రీకరణలోనూ కొన్ని కష్టాలు తప్పలేదనుకొంటా. మధ్యలో రెండు నెలలు షూటింగ్ ఆపేశారు కూడా. దానికంటూ ప్రత్యేక కారణాలున్నాయా?
మేం కెమెరామెన్ కోసం వెయిట్ చేయాల్సివచ్చింది. బెటర్ అవుట్ పుట్ కోసమే… రెండు నెలలు ఆగాం. పైగా మార్చి ఎండింగ్లో ఉండే సమస్యలు మీకు తెలిసిందే కదా? ఎంత గొప్ప ప్రొడ్యూసర్‌కి అయినా.. ఆ కష్టాలు తప్పవు. దాని వల్ల సినిమా డిలే అయ్యింది అంతే.
మీ పారితోషికంలో బ్లాక్ ఎంత? వైట్ ఎంత?
(నవ్వుతూ) అంతా వైటే నండీ.. బ్లాక్ లేదు. నిజానికి నేను దాచుకొనేంతలా సంపాదించలేదు. కాబట్టి నాకు భయం లేదు.
ఇంతకీ ఈసినిమా కథేంటి? దెయ్యాలున్నాయని చెబుతున్నారా?
కథ ఇదీ అని చెప్పేస్తే ఆ కిక్ పోతుంది. ఇదో లవ్ స్టోరీ. దాంట్లోనే ఫాంటసీ కూడా ఉంటుంది. హారర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. దెయ్యం ఉందన్నది చాలామంది నమ్మకం. రష్యాలో ఓ అమ్మాయి సడన్‌గా లేచి తెలుగులో మాట్లాడిందట. దాన్ని ఏం అనుకోవాలి..? మా దర్శకుడు ఆత్మల మీద కాస్త సైంటిఫిక్ రీసెర్చ్ చేశాడు. అదే ఈ సినిమాలో కనిపిస్తుంది.
హారర్ కామెడీ సినిమాలు చూసి జనాలకు బోర్ కొట్టేసింది..
ఇది ఆ టైపు సినిమా కాదండీ. దెయ్యం అంటే జట్టు విరబూసుకొని, కళ్ల కింద కాటుక పెట్టుకొని, సడన్‌గా వచ్చి బూచ్ అని భయపెట్టే దెయ్యం మా సినిమాలో ఉండదు. కాబట్టి ఆ పాత సినిమాల్ని గుర్తు చేయదు.
కొత్త కొత్త కాన్సెప్ట్‌లను బాగానే పట్టుకొంటున్నారే…
రెగ్యులర్ సినిమా తీస్తానంటే జనం చూడరండీ. ఏదో ఓ కొత్త విషయం ఉండాల్సిందే. అందుకోసమే నెలల తరబడి అన్వేషిస్తుంటా. అందరిలా నేనూ యేడాదికి మూడు నాలుగు సినిమాలు చేసేయొచ్చు. అలా చేస్తే.. క్వాలిటీ దెబ్బతింటుందని నా భయం.
ఈ మధ్య నిఖిల్ దర్శకుల పనిలో తెగ ఇన్వాల్వ్ అవుతున్నాడని అంటున్నారు.. నిజమేనా?
నిజంగా సినిమాల్ని నేను కెలకనండీ బాబూ.. కావాలంటే నా దగ్గర పని చేసిన దర్శకులనెవరినైనా అడగండి. దర్శకుడి పనిలో జోక్యం చేసుకొంటే సినిమా ఫ్లాప్ అవుతుందని భావించేవాడ్ని. అయితే పబ్లిసిటీ విషయంలో చాలా కేర్ తీసుకొంటా. సినిమా పూర్తయిన తరవాత నేను రంగంలోకి దిగుతా. పబ్లిసిటీ ఎలా చేసుకొంటే బెటర్‌గా ఉంటుందో నాకు తోచిన సలహాలిస్తా. అంతే.
శంకరాభరణం ఫ్లాప్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా?
ఫ్లాప్స్ సహజమే కదండీ. అన్ని హిట్ సినిమాలే చేయలేం కదా? అప్పుడప్పుడూ ఫ్లాపులూ తగలాలి.
దాన్నుంచి ఏం నేర్చుకొన్నారు?
ప్రతీ ఫ్లాప్ నుంచీ ఏదోటి నేర్చుకోవాల్సిందే. ఆబ్లికేషన్ల కోసం సినిమాలు చేయకూడదని అర్థమైంది. కథ ముఖ్యం. ఆ తరవాతే ఏదైనా..
లవ్ స్టోరీలకు దూరమైపోతున్నట్టున్నారు?
నిజమే. కాన్సెప్ట్ ప్రకారం సాగే సినిమాలో లవ్‌కి చోటు తక్కువ. అయితే ఎక్కడికి పోతావు చిన్నవాడాలో మాత్రం లవ్ స్టోరీనే ప్రధానంగా ఉంటుంది. లవ్ స్టోరీ చేయాలని మాత్రం చేయకూడదు. కథ డిమాండ్ చేయాలి. ఏ జోనర్ సినిమా అయినా అంతే.
కార్తికేయ 2 ఉంటుందా?
తప్పకుండా ఉంటుంది. చందూమొండేటి చాలా మంచి కథ రాశాడు. కార్తికేయ కంటే బాగుంటుంది. స్క్రిప్టు కూడా రెడీగా ఉంది. కాకపోతే చందూకి కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తయ్యాకే మా సినిమా ఉంటుంది.
ప్రస్తుతం ఏం చేస్తున్నారు?
సుధీర్ వర్మ సినిమా దాదాపుగా 40 శాతం పూర్తయ్యింది. వచ్చే యేడాది రిలీజ్ అవుతుంది.
ఓకే.. ఆల్ ద బెస్ట్
థ్యాంక్యూ..