చిన్న చిన్న సినిమాలతో, ఒక్కో అడుగూ ముందుకు వేస్తూ ఎదిగాడు నిఖిల్. కార్తికేయ 2 తన రేంజ్ పెంచింది. నిఖిల్ పై మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు కూడా వర్కవుట్ అవుతాయన్న నమ్మకాన్ని కలిగించాడు. అందుకే ఇప్పుడు తెరకెక్కిస్తున్న ‘స్వయంభూ’పై దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తోంది. నిఖిల్ పై ఇది పెద్ద రిస్కే. ఎందుకంటే ఓటీటీల పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. సినిమా చూసి తప్ప కొనడం లేదు. ఈ బడ్జెట్ రికవరీ అవ్వాలంటే ఓటీటీ నుంచి మంచి మొత్తం రాబట్టుకోవాలి. అయితే ‘స్వయంభూ’ ఇప్పటి వరకూ ఓటీటీ డీల్ జరగలేదు. వీఎఎఫ్ఎక్స్ పనులు పూర్తయ్యాక, అవుట్ పుట్ చూసే.. సినిమాని కొనడానికి సిద్ధం అవుతున్నాయి ఓటీటీ సంస్థలు. స్వయంభూ ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వాలంటే ఇంకొంత సమయం పడుతుంది.
అయితే ఈరోజు విడుదల చేసిన టీజర్ మాత్రం ప్రామిసింగ్ గా అనిపించింది. ఈ సినిమాపై ఎందుకు ఇంత ఖర్చు పెట్టాల్సివచ్చిందో అర్థమైంది. విజువల్స్ బాగున్నాయి. పైగా త్రీడీ ఎఫెక్టులు బాగా కుదిరాయి. కాబట్టి ఈమాత్రం ఖర్చు పెట్టడంలో తప్పు లేదు. అన్నింటికంటే ముఖ్యంగా వేసవిలో వస్తోంది. కాబట్టి… ఫుట్ ఫాల్స్ బాగుంటాయి. కాకపోతే ఓటీటీ డీల్ ముందే అయితే… నిర్మాతలకు కాస్త భరోసా ఉంటుంది. ఓటీటీ సగం బడ్జెట్ ని రాబట్టగలిగితే మిగిలినవి థియేటర్ నుంచి తీసుకురావొచ్చు. నిఖిల్ గత చిత్రం ‘కార్తికేయ 2’ బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు అందుకొంది. కాబట్టి.. నిర్మాతలు కూడా కాస్త రిలాక్డ్స్ గా ఉన్నారు. మార్చి నాటికి తొలి కాపీ సిద్ధం అవుతుంది. ఏప్రిల్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తారు.
