ఓటీటీ మార్కెట్ ఒక్కో సినిమా విషయంలో ఒక్కోలా స్పందిస్తుంటుంది. కొన్ని సినిమాల్ని ఓటీటీ పట్టించుకోవడం లేదు. ఇంకొన్ని సినిమాలకు ఫ్యాన్సీరేట్లు గుప్పిస్తున్నాయి. ‘స్వయంభూ’కీ అలాంటి క్రేజ్ ఉంది. ‘కార్తికేయ 2’ లాంటి సూపర్ హిట్ తరవాత నిఖిల్ నుంచి వస్తున్న సినిమా ఇది. పైగా వార్ బ్యాక్ డ్రాప్. టెక్నికల్ టీమ్ స్ట్రాంగ్ గా ఉంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. దాంతో ఓటీటీ సంస్థలు ఈ సినిమా కొనడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అమేజాన్, నెట్‌ఫ్లిక్స్‌లు ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేశాయి. అయితే నిర్మాత ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. ఈవారంలో డీల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది.
సినిమాని కొనే విషయంలో ఓటీటీలు రెండు రకాల వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఒకటి ఏదో ఓ రేటుకి గంపగుత్తగా కొనేయడం. రెండోది.. ముందు ఓ బేస్ రేట్ ఇచ్చి, ఆ తరవాత సినిమా పెర్ఫార్మెన్స్ ని బట్టి మరింత ముట్టజెప్పడం. అంటే బాక్సాఫీసు దగ్గర వసూళ్లని బట్టి ఓటీటీ రేటు ఉంటుంది. `స్వయంభూ` నిర్మాతలకు తమ సినిమాపై గట్టి నమ్మకం ఉంది. అందుకే బాక్సాఫీసు కలక్షన్ల ప్రకారమే రేటు కట్టమని అడుగుతున్నారు. ఈమధ్య కాలంలో సినిమా చూసిన తరవాతే ఓటీటీ సంస్థలు కొంటున్నాయి. స్వయంభూ ని కూడా చూపించే అమ్మడానికి నిర్మాత రెడీ అయ్యారు.
ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఇది వరకు ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ మారే అవకాశం ఉంది. ఈనెల 15న ఫస్ట్ కాపీ చేతికి వస్తుందని తెలుస్తోంది. ఆ తరవాతే.. రిలీజ్ డేట్ పై ఓ స్పష్టత వస్తుంది.
