అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, కొలంబియాలో నివసిస్తున్న 27 ఏళ్ల నిఖితా గొడిశాల దారుణ హత్యకు గురయ్యారు. ఎల్లికాట్ సిటీలో డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్న ఆమె, 2025 డిసెంబర్ 31న కనిపించకుండా పోయారు. ఆమె ఆచూకీ కోసం స్నేహితులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే, జనవరి 3న ఆమె తన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు
నిఖిత శరీరంపై పలుచోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలోనే అర్జున్ ఆమెను హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ఏం జరిగిందో ఆరా తీసిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. ఆమె మాజీ ప్రియుడే హత్య చేశాడని గుర్తించారు. ఆమెను చంపిన తర్వాత ఏమీ ఎరగనట్టుగా జనవరి 2వ తేదీన అర్జున్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి, నిఖితా కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. తానే చివరిసారిగా ఆమెను చూశానని నమ్మించే ప్రయత్నం చేశాడు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే, అదే రోజు అర్జున్ శర్మ అమెరికా నుంచి భారతదేశానికి పారిపోయాడు. అతడు పారిపోయిన తర్వాత పోలీసులు అతని అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించగా నిఖితా మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం అమెరికా పోలీసులు అర్జున్ శర్మపై మర్డర్ కేసులు నమోదు చేసి, అతని కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతడిని పట్టుకునేందుకు అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు భారతీయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి.
నిఖితా గొడిశాల కుటుంబం సికింద్రాబాద్ లో ఉంటున్నట్లుగా భావిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖితా ఇలాంటి ఘోరానికి బలికావడం ఆమె కుటుంబ సభ్యులను, ఎన్నారై కమ్యూనిటీని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ కేసులో న్యాయం జరిగేలా చూస్తామని వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
