ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించలేమని.. ఏపీ ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ.. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ను కలిసి చెప్పేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఈసీని కొత్త సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ , పంచాయతీరాజ్, వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేదీ, సింఘాల్‌లు కలిశారు. ప్రభుత్వం వాదనను వినిపించారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులు… స్ట్రెయిన్ జాగ్రత్తలు.. కరోనా టీకా షెడ్యూల్ ఇలా అన్ని కారణాలను ఎస్ఈసీ ముందు ఉంచారు. నిమ్మగడ్డ హయాంలో ఎన్నికల నిర్వహణకు విముఖంగా ఉన్న ప్రభుత్వం.. మొదటి నుంచి.. అనేక కారణాలను చెబుతూ.. వస్తోంది. కోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలు చేసింది.
అయితే.. ఎన్నికల కమిషన్ ప్రొసీడింగ్స్ ఇచ్చేసింది. పాటించకపోతే రాజ్యాంగ ధిక్కరణ అయ్యే ప్రమాదం ఉడటంతో… ప్రభుత్వం న్యాయ పోరాటం ప్రారంభించింది. హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు… ఇరువర్గాలను కూర్చుని మాట్లాడుకోవాల్సిందిగా ఆదేశించింది. చివరికి నిర్ణయం ఎన్నికల సంఘం తీసుకోనుంది. ఈ మేరకు ప్రభుత్వం ముగ్గురు అధికారుల్ని పంపిన తన వాదన వినిపించింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందన ఏమిటో స్పష్టత లేదు. ఆయన తీసుకునే నిర్ణయం ఆధారంగానే ఎన్నికలు ఉంటాయా.. ఉండవా అన్న అంశం ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు నిమ్మగడ్డ ఏం చేస్తారన్న ఉత్కంఠ ఏర్పడింది. ఆయనకు రాజ్యాంగ పరమైన అధికారాలు ఉన్నాయి. ఆయన ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటిస్తే.., ప్రభుత్వ యంత్రాంగం సహకరించాల్సిందే. లేకపోతే.. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. అయితే.. న్యాయపోరాటం లేదా.. ఇతర అంశాల ద్వారా మార్చి వరకూ ఆలస్యం చేస్తే చాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఆ తర్వాత ఆయన రిటైరైతే… తమ వారిని ఎస్ఈసీగా నియమించుకుని మేలో స్థానికలు నిర్వహించాలని వైసీపీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు.