నిర్భయ కేసు దోషి అతి తెలివి…!

ఢిల్లీ నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష ఈ నెల 16న అమలు చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. కాని ఇది ఇంకా ఆలస్యమయ్యేటట్లు కనబడుతోంది. ఇందుకు కారణం…నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్‌సింగ్‌ ఠాకూర్‌ ఉరిశిక్షకు సంబంధించి సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయడమే.శిక్షను మరి కొంతకాలం వాయిదా వేసేందుకు దోషులకు ఇదో మార్గం. అక్షయ్‌ సింగ్‌ ఈ కేసు మొత్తం మీద రివ్యూపిటిషన్‌ వేయలేదు. తనకు విధించిన ఉరిశిక్షను తిరిగి సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్‌ వేశాడు. క్షమాభిక్ష పిటిషన్‌ వేయడం, రివ్యూ పిటిషన్‌ వేయడం దోషులకు న్యాయవ్యవస్థ కల్పించిన హక్కు. దాన్ని ప్రశ్నించే అధికారం లేదు.

దోషులకు తమ వాదన చివరి క్షణం వరకు వినిపించే హక్కు ఉందనేది న్యాయ వ్యవస్థ అభిప్రాయం. అందుకే ఈ వెసులుబాటు. సరే…ఈ వెసులుబాటు వల్ల అక్షయ్‌సింగ్‌ రివ్యూ పిటిషన్‌ వేయడం, దాని విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించడం జరిగిపోయాయి. అయితే అక్షయ్‌సింగ్‌ ఈ రివ్యూ పిటిషన్‌లో తన తెలివితేటలు చూపించకున్నాడు. తెలివితేటలు అనడం కంటే ‘అతి తెలివి’ అంటే సరిగ్గా ఉంటుందేమో…! ఢిల్లీలో వాయి కాలుష్యం, నీటి కాలుష్యం గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ పాపులర్‌ అయింది. ఇక్కడ కాలుష్యం తగ్గించడానికి , ప్రజలకు భద్రత కల్పించడానికి ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకుంటున్నా సరైన ఫలితాలు రావడంలేదు.

వాహనాలకు (ప్రధానంగా కార్లకు) సరి-బేసి విధానం అమలు చేస్తున్నారు. కొన్నాళ్లు పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలు మూసేశారు. ఐటీ కంపెనీలు ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయమంటున్నాయి. ఢిల్లీ కాలుష్యం అనేది పెద్ద విషాద గాథ. ఈ నేపథ్యంలో అక్షయ్‌ సింగ్‌ తన రివ్యూ పిటిషన్‌లో ఈ పరిస్థితిని ఉపయోగించుకున్నాడు. ఢిల్లీలో వాయి కాలుష్యం, నీటి కాలుష్యం కారణంగా ప్రజల జీవితం చిన్నదైపోయిందని అంటే కాలుష్యం వల్ల ప్రాణాలు త్వరగా పోతాయని పిటిషన్‌లో పేర్కొన్నాడు. రివ్యూ పిటిషన్‌లో ఈ సామాజిక, పర్యావరణ సమస్యల ప్రస్తావన ఎందుకని డౌటుగా ఉంది కదూ.

ఇక్కడే ట్విస్ట్‌ ఇచ్చాడు అక్షయ్‌ సింగ్‌. ‘డిల్లీలో వాయి కాలుష్యం కారణంగా నగరం గ్యాస్‌ ఛాంబర్‌లా మారింది. నీరు విషమైంది. ఈ కాలుష్యాల వల్ల ప్రజల ఆయుష్షు తగ్గిపోయి త్వరగా ప్రాణాలు పోతాయి. ఇలాంటప్పుడు మరణ శిక్ష అవసరమా?’ అని ప్రశ్నించాడు అక్షయ్‌ సింగ్‌ ఠాకూర్‌. కాలుష్యం వల్ల తాము ఎలాగూ త్వరగానే చనిపోతాము కాబట్టి మరణశిక్ష రద్దు చేయాలని కోరాడు. తనను తప్పుగా దోషిని చేశారని, అనేక దేశాల్లో మరణశిక్ష అమలులో లేదని సుప్రీం కోర్టుకు గుర్తు చేశాడు.

ఈ రివ్యూ పిటిషన్‌కు సుప్రీం కోర్టు ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా. కాబట్టి ఉరిశిక్ష అమలు మరింత ఆలస్యం కావొచ్చు. ఈ కేసులో దోషులైన వినయ్‌ శర్మ, పవన్‌కుమార్‌ గుప్తా క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయలేదు. ఒకవేళ అక్షయ్‌ సింగ్‌ రివ్యూ పిటిషన్‌ను తిరస్కరిస్తే మిగిలిన ముగ్గురు కలిసి రివ్యూ పిటిషన్‌ వేస్తారని వారి తరపు న్యాయవాది తెలిపాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com