ఈ అమ్మకు ఆ అమ్మ ఆవేదనాపూరిత.. ఆశాజనక సందేశం..!

వారిద్దరూ కన్నబిడ్డలను పోగొట్టుకున్న అమ్మలు. పోగొట్టుకోవడమంటే వారి ఆడబిడ్డలు ఏ జబ్బు వచ్చో, ప్రమాదాల్లోనో చనిపోలేదు. మానవ మృగాలు వారిపై కొన్ని గంటలపాటు కిరాతకంగా అత్యాచారం చేసి, పైశాచికంగా చంపేశాయి. ఆ అమ్మల కడుపుకోత, గుండెకోత సాక్షాత్తూ దేవుడే దిగివచ్చినా తీర్చలేనిది. ఆ ఇద్దరు ఆడబిడ్డలు దాదాపు ఒకేవిధంగా ముష్కరుల పైశాచికత్వానికి బలైపోయారు. వారే 2012లో ఢిల్లీలో నిర్భయ, మొన్నీమధ్య హైదరాబాదులో దిశ. నిర్భయ డాక్టరు (ఫిజియోథెరపిస్టు), దిశ డాక్టరే (వెటర్నరీ). నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు రాత్రివేళ అత్యాచారం చేశారు. ఆ తరువాత రోడ్డు మీద పడేసి వెళ్లిపోయారు. ఆమె 13 రోజులపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలింది.

దిశపై నలుగురు రాత్రివేళే అత్యాచారం చేశారు. చివరకు ఆమెను కాల్చి బూడిద చేశారు. ఈ రెండు దారుణాలు దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించాయని చెప్పొచ్చు. చలించని మనిషి లేడు. జ్వలించని హృదయం లేదు. వీరి ఇద్దరి తల్లుల హౄదయ వేదన ఒక్కటే. కడుపు తీపి, కడుపుకోత ఒక్కటే. అందుకే నిర్భయ తల్లి ఆశాదేవి హైదరాబాదులోని దిశ తల్లికి ఆవేదనాపూరిత, ఆశాజనక సందేశం పంపారు. అంటే ఆమె ఒక పక్క ఆవేదన చెందుతూనే మరోపక్క దిశను బలగొన్నవారికి శిక్ష పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆశాదేవి ఆవేదన రెండు రకాలు. ఒకటి కూతురును కోల్పోయిన బాధ. మరొకటి తన కూతురును పొట్టనబెట్టుకున్న రాక్షసులకు ఇప్పటివరకు శిక్ష అమలు జరగకపోవడం. ‘నా కూతురుకు న్యాయం జరగలేదు. మీ కూతురుకైనా న్యాయం జరుగుతుందన్న ఆశ ఉంది’…అని దిశ తల్లికి పంపిన సందేశంలో ఆమె పేర్కొన్నారు. ‘నా కూతరుకు న్యాయం జరగాలని మేం ఏళ్లతరబడి పోరాడుతూనే ఉన్నాం. అయినా న్యాయం జరగలేదు.అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. దిశ విషయంలో వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందన్న ఆశాభావం ఉంది’…అని ఆశాదేవి పేర్కొన్నారు. అలా జరుగుతుందా? జరిగితే మంచిదే. కాని జరుగుతుందని ఎక్కువమంది నమ్మడంలేదు.

నిర్భయ హంతకులకు ఇప్పటివరకు ఎందుకు శిక్ష పడలేదన్నది సామాన్యులకు అర్థకాని విషయం. వారికి ప్రత్యేక కోర్టు విధించిన మరణ శిక్షను ఢిల్లీ హైకోర్టు , సుప్రీం కోర్టు సమర్ధించాయి. అయినప్పటికీ ఇప్పటికీ శిక్ష అమలు చేయలేదు. ఈ కేసులోని ఆరుగురు దోషుల్లో ఒకడు జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు మైనర్‌ కావడంతో వాడిని జువైనల్‌ హోంకు పంపారు. మిగతా నలుగురుకి శిక్ష అమలు చేయాల్సివుంది. కాని చేయడంలేదు. ఈమధ్యనే దోషులకు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే అవకాశం కల్పించారు. ఇందుకు ఏడు రోజుల సమయం ఇచ్చారు. ఆ తరువాత ఏమైందో తెలియలేదు. అప్పట్లో ఈ కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేశారు కూడా. నిర్భయ కేసులో నిందితులు దోషులని తేలాక, మరణ శిక్షను సుప్రీం కోర్టు సమర్థించాక ఇంత జాప్యం ఎందుకో అర్థం కావడంలేదు.

అత్యంత తీవ్ర నేరాల విషయంలోనే చాలా అరుదుగా మరణశిక్ష అమలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఈ శిక్ష అమలుకు కూడా ఏళ్లూ పూళ్లూ పడుతోంది. ఇందుకు నిర్భయ కేసే ఉదాహరణ. దిశ విషయంలోనే దోషలుకు మరణ శిక్ష విధించాలని సామాన్యుల నుంచి పాలకుల వరకు కోరుతున్నారు. కాని ఏం శిక్ష పడుతుందో ఏం చెప్పగలం? ఈ కేసు విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేస్తామని పాలకులు, పోలీసులు చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై కూడా హామీ ఇచ్చారు. పాస్ట్‌ ట్రాక్‌ కోర్టు సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి తీర్పు ఇచ్చినా దాన్ని వెంటనే అమలు చేయకపోతే న్యాయం జరిగినట్లు కాదు కదా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com