కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సిటీ ఎకనామిక్ రీజియన్స్ పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెను మార్పులకు నాంది పలకనుందని భావిస్తున్నారు. మెట్రో నగరాలకే పరిమితమైన అభివృద్ధిని టైర్-2, టైర్-3 నగరాలకు విస్తరించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ నగరాల జాబితాలో విశాఖ కూడా ఉంది.
కేంద్ర బడ్జెట్ 2026 ప్రకారం, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఏడు సిటీ ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధి కోసం ఒక్కో ప్రాంతానికి ఐదేళ్ల కాలానికి రూ. 5,000 కోట్లు కేటాయించారు. ఈ జాబితాలో విశాఖపట్నం, పూణే, సూరత్, వారణాసి వంటి నగరాలతో పాటు భువనేశ్వర్-పూరీ-కటక్ , కోయంబత్తూర్-ఈరోడ్-తిరుప్పూర్ వంటి క్లస్టర్లను ప్రభుత్వం చేర్చింది. ఈ నిధులతో ఆయా నగరాల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థలు, పారిశ్రామిక కారిడార్లను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో అభివృద్ధి చేస్తారు.
ఈ కొత్త విధానం కేవలం అభివృద్ధి నిధుల కేటాయింపుకే పరిమితం కాకుండా ఛాలెంజ్ మోడ్ ద్వారా అమలు కానుంది. అంటే, ఏ నగరమైతే పట్టణ సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేసి, ఫలితాలను చూపుతుందో ఆ నగరాలకే ప్రాధాన్యత లభిస్తుంది. ముఖ్యంగా ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు ,ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న ఆలయ పట్టణాలను కూడా ఈ ఆర్థిక మండలాలుగా తీర్చిదిద్ది, వాటిని కొత్త ఉపాధి కేంద్రాలుగా మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఈ నిర్ణయం ఒక గేమ్ ఛేంజర్ గా మారనుంది. మెట్రో నగరాల్లో పెరిగిన స్థలాల ధరలు , ట్రాఫిక్ సమస్యల వల్ల ఇప్పటికే ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ఇప్పుడు CERల ద్వారా చిన్న నగరాల్లో మెరుగైన కనెక్టివిటీ, డ్రైనేజీ, విద్యుత్ మరియు ఐటీ హబ్‌లు ఏర్పాటైతే.. రియల్ ఎస్టేట్ డిమాండ్ అటువైపు మళ్లుతుంది.