నితిన్ ఈమధ్య వరుస ఫ్లాపులతో డీలా పడ్డాడు. కమర్షియల్‌గా గట్టెక్కుతాయని నమ్మిన సినిమాలు కూడా నిరాశ పరిచాయి. ఆఖరికి దిల్ రాజు అనుభవం కూడా పని చేయలేదు. వేణు శ్రీరామ్ తో రూపొందించిన ‘తమ్ముడు’ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈతరుణంలో చేతిలో ఉన్న సినిమాలపై మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దిల్ రాజు కాంపౌండ్ లోనే రూపొందించాల్సిన ‘ఎల్లమ్మ’ సినిమా ఇప్పుడు డైలామాలో ఉంది. ఈలోగా విక్రమ్ కె.కుమార్ తో ఓ సినిమాని మొదలెట్టబోతున్నాడు నితిన్.
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఇష్క్’ మంచి విజయాన్ని అందుకొంది. ‘ఇష్క్ 2’ తీయాలని భావించినా, ఆ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. ఈసారి నితిన్ కోసం ఓ స్పోర్ట్స్ డ్రామా రాశాడు విక్రమ్. గుర్రపు స్వారీ నేపథ్యంలో సాగే కథ ఇదని తెలుస్తోంది. ఇందులో నితిన్ హార్స్ రైడర్‌గా కనిపించబోతున్నాడు. స్క్రిప్టు దాదాపుగా పూర్తయ్యింది. నితిన్ పూర్తి కథ వినేశాడు. చిన్న చిన్న మార్పులతో ఈ కథ ముందుకు వెళ్లబోతోంది. ఈ చిత్రానికి ‘స్వారీ’ అనే టైటిల్ అనుకొంటున్నారు. ‘జాకీ’ అనే పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే ‘జాకీ’ అనే పేరుతో ఇది వరకే ఓ సినిమా వచ్చింది. అందులో శోభన్‌బాబు హీరో. అందుకే ఆ టైటిల్ కంటే ‘స్వారీ’నే బాగుంటుందని విక్రమ్ భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే. తెలుగులో గుర్రపు స్వారీ నేపథ్యంలో సినిమాలు పెద్దగా రాలేదు. కాబట్టి.. ఈ జోనర్ కాస్త కొత్తగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. అది పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలెడతారు.