ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి పదో సమావేశం టీమ్ ఇండియా స్ఫూర్తిని చూపించింది. ఈ సారి బీజేపీయేతర సీఎంలు కూడా హాజరయ్యారు. కేరళ , కర్ణాటక , పుదుచ్చేరి సీఎంలు హాజరు కాలేదు. కానీ వారి తరపున ప్రతినిధులు హాజరయ్యారు. కర్ణాటక సీఎం తమ ప్రజంటేషన్ ను పంపించారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరయ్యారు. ప్రధాని మోదీతో ఉల్లాసంగా, ఉత్సాహంగా మాట్లాడారు.
సమావేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలు తమ తమ లక్ష్యాలను వివరించారు. నీతి ఆయోగ్ నుంచి అందాల్సిన సహకారాన్ని కోరారు. ప్రధాని మోదీని తీవ్రంగా విబేధించే తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా హాజరయ్యారు. ప్రధాని మోదీతో సరదాగా మాట్లాడుతూ కనిపించారు.చంద్రబాబు, స్టాలిన్ లతో మోదీ పలు అంశాలపై సీరియస్ గా చర్చిస్తూ కనిపించారు. రేవంత్ రెడ్డితోనూ మోదీ చర్చలు జరిపారు. సమావేశం ముగిసిన తర్వాత కాసేపు రేవంత్ విజ్ఞప్తులు వినేందుకు అవకాశం కల్పించారు కూడా.
సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రాలన్నీ కలిస్తేనే దేశం అని..అన్ని రాష్ట్రాలు సమ్మిళితంగా అభివృద్ధి సాధిస్తేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని.. అందుకే అందరూ టీమ్ ఇండియా స్ఫూర్తితో పని చేయాలని మోదీ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ ను అభివృద్ది చెందిన రాష్ట్రంగా చూడాలన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి గతంలో కేసీఆర్ కూడా హాజరు కాలేదు. తెలంగాణ నుంచి తొలి సారి రేవంత్ హాజరయ్యారు.