పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎన్డీయేయేతర నేతలు చాలా మంది విమర్శల బాట పట్టారు. మోడీప్రభుత్వంపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రం మోడీ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారు. వారిలో మొదటి వ్యక్తి బిహార్ సీఎం నితీష్ కుమార్. రెండో వ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్.
మోడీ నిర్ణయం వెలువడిన కొన్ని గంటల్లోనే నితీష్ కుమార్ సమర్థించారు. కేసీఆర్ కొంత సమయం తీసుకున్నారు. పరిస్థితిని, ప్రజల ఇబ్బందులను అంచనా వేసిన తర్వాత స్పందించారు. మొత్తానికి నల్లధనంపై అంకుశానికి తమ మద్దతు ఉంటుందని నితీష్, కేసీఆర్ ఇద్దరూ విస్పష్టంగా ప్రకటించారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మొత్తం మీద ప్రజల మద్దతు ఉంటుందని నితీష్ అందరికంటే ముందే అంచనా వేశారట. పైగాక్లీన్ ఇమేజ్ ఉన్న నితీష్, ఈ నిర్ణయం దేశానికి మంచిదనే నిర్ణయానికి వచ్చారు. కేసీఆర్ నేను సైతం అన్నట్టు, నల్లధనంపై యుద్ధానికి మద్దతిచ్చే నాయకుడిగా మంచి ఇమేజ్ పొందారని అంటున్నారు. ఇబ్బందులున్నా ప్రజల మద్దతున్న నిర్ణయాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదనేది కేసీఆర్ ఉద్దేశం.
మోడీ నిర్ణయం తర్వాత నితీష్ అనూహ్య రీతిలో స్పందించడం ద్వారా మోడీకి అండగా నిలిచారు. ప్రధానికి తనవైన సూచనలు ఇవ్వడం ద్వారా కేసీఆర్ కూడా నితీష్ తరహా ఇమేజినే పెంచకుంటున్నట్టు కనిపిస్తోంది. పూర్ణ క్రాంతి, అంటే సంపూర్ణ విప్లవం తేవాలని మోడీని కోరడం ద్వారా కేసీఆర్ క్లీన్ ఇమేజి దిశగా గట్టి ప్రయత్నమే చేశారు. మరోవైపు, ఈ అంశంపై ముఖ్యమంత్రుల కమిటీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వం వహిస్తారట. అంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఈ విషయంలో మోడీకి పూర్తి బాసటగా ఉన్నట్టే.