బీహార్ సీఎం నితీష్ కుమార్ ఓ మహిళా డాక్టర్ హిజాబ్ లాగే ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది. సోమవారం పట్నాలో 1,283 మంది కొత్త డాక్టర్లకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. ఈ సమయంలో ఒక ముస్లిం మహిళా డాక్టర్ హిజాబ్‌ను బలవంతంగా లాగే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన మానసిక స్థితిపై మరోసారి చర్చ ప్రారంభమయింది.
డాక్టర్ ఉద్యోగం సాధించిన నుస్రత్ పర్వీన్ కు అపాయింట్ మెంట్ లెటర్ సీఎం స్వయంగా అందించారు. ఆ సమయంలో లెటర్ అందజేస్తూ, బలవంతంగా హిజాబ్‌ను లాగి, ఆమె ముఖాన్ని బయటపెట్టారు. నుస్రత్ అసౌకర్యంగా నిలబడి ఉన్నారు. సీఎం అలా చేయడం ఆమె ఊహించి ఉండరు. నితీష్ అలా చేయడాన్ని ఎదురుగా ఉన్న కొంత మంది జోక్ అనుకున్నట్లుగా పగలబడి నవ్వారు. డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌధరీ ఆయన చేతిని పట్టుకుని ఆపడానికి ప్రయత్నించారు. కానీ ఆయన పట్టించుకోలేదు.
ఈ ఘటనపై వెంటనే విపక్షాలు స్పందించారు. నితీష్ కుమార్ వయసు మీదపడిపోవడం వల్ల మానసిక స్థితి దెబ్బతిన్నట్టుందని ప్రచారం చేస్తున్నారు. మహిళను పబ్లిక్‌లో ఇలా అవమానించకూడదని.. తండ్రిలాంటి వాడినని చెప్పి సమర్థించుకోవద్దని అంటున్నారు. గతంలోనూ ఆయన బహిరంగసభల్లో ఇలా వింతగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయి. ఈ కారణంగానే బీహార్ లో మళ్లీ ఎన్డీఏ గెలిచినా ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరని చెప్పుకున్నారు. కానీ ఎన్నికలకు ముందే ఆయనే సీఎం అవుతారని అమిత్ షా, మోదీ ప్రకటించారు. ఆ ప్రకారం బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా ఆయనకు చాన్స్ ఇచ్చారు.
ఇలాంటి ఘటనలు ముదిరితే.. ఆయనకు త్వరలోనే రాజకీయంగా విశ్రాంతిని ఇచ్చి వేరే వారిని బీహార్ సీఎం పదవిలో కూర్చోబెట్టే అవకాశం బీజేపీకి ఉంటుంది.
