ఉపరాష్ట్రపతి జగదీప్ థన్‌ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇక ఉపరాష్ట్రపతి పదవికి ఉపఎన్నిక పదవికి ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించనుంది. అయితే ఇప్పుడు బీజేపీ పెద్దల దృష్టిలో ఉపరాష్ట్రపతి పదవికి ఎవరు ఉన్నారన్నది సస్పెన్స్ గా మారింది. పలు పేర్లు ప్రచారంలోకి వస్తున్నప్పటికీ.. ఒకే ఒక్క పేరుపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ఆ పేరు బీహార్ సీఎం నితీష్ కుమార్.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి ఇప్పుడు ఓ సవాల్ గా మారింది. సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న నితీష్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఆయన అంత చురుకుగా వ్యవహరించలేకపోతున్నారు. విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఆరోగ్యం కూడా సరిగా లేదని అంటున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ, జేడీయూ సీఎం ఫేస్‌గా ఈ సారి నితీష్‌ను కాకుండా కొత్త వ్యక్తిని చూపించాలనుకుంటున్నారు. అయితే సీఎం నితీష్ ను తప్పించడం వల్ల బలమైన వర్గం అసంతృప్తికి గురైతే మొదటికే మోసం వస్తుంది. అందుకే నితీష్ ను అత్యున్నతంగా గౌరవిస్తున్నామని చెప్పేందుకు ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
నితీష్ కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించి ఉన్నట్లయితే.. ఖచ్చితంగా ఆయన తదుపరి ఉపరాష్ట్రపతి అవుతారు. అదే సమయంలో.. శశిథరూర్ తో సహా మరో ఇద్దరు కేంద్ర మంత్రుల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. మోదీ, షా రాజకీయ వ్యూహాల ప్రకారమే థన్‌ఖడ్ రాజీనామా చేసి ఉంటారు కాబట్టి.. వారి ఆలోచనల ప్రకారమే తదుపరి ఎంపిక ఉంటుంది. వారెవరన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.