బీహార్ రాజకీయాల్లో ఒక శకం ముగియబోతోందనే సంకేతాలిస్తూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజా ప్రకటన చేశారు. గత రెండు దశాబ్దాలుగా బీహార్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని, అందించిన మద్దతును స్మరించుకుంటూ ఆయన ఒక భావోద్వేగపూరిత ప్రకటన విడుదల చేశారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజల తోడ్పాటు వల్లే బీహార్ ఈరోజు అభివృద్ధి , గౌరవప్రదమైన స్థానంలో నిలవగలిగిందని, దీనికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రకటనలో అత్యంత కీలకమైన అంశం ఆయన తన భవిష్యత్ రాజకీయ గమనాన్ని వెల్లడించడం. తన పార్లమెంటరీ జీవితం ప్రారంభమైనప్పటి నుండి బీహార్ శాసనసభ, శాసనమండలితో పాటు పార్లమెంటులోని రెండు సభల్లోనూ సభ్యుడిగా ఉండాలనే బలమైన కోరిక తనకు ఉండేదని నితీష్ వెల్లడించారు. ఆ క్రమంలోనే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో తాను రాజ్యసభ సభ్యుడిగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఇది ఆయన ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల నుండి తప్పుకుని, కేంద్ర రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నట్లు సూచిస్తోంది.
బీహార్ ప్రజలతో తనకున్న బంధం శాశ్వతమని, రాష్ట్ర అభివృద్ధి కోసం తన సంకల్పం మారదని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో త్వరలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి తన పూర్తి సహకారం, మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన ప్రకటించడం ద్వారా అధికార మార్పిడికి , వారసత్వ రాజకీయాలకు పరోక్షంగా పునాది వేశారు. నితీష్ కుమార్ లాంటి సీనియర్ నేత రాష్ట్ర రాజకీయాల నుండి తప్పుకుని రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకోవడం బీహార్ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా భావించవచ్చు. అయితే ఆయనా ప్రత్యక్ష ఎన్నికల్లోఎమ్మెల్యేగా ఎప్పుడూ పోటీ చేయలేదు. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగానే ఉన్నారు.
