కల్వకుంట్ల కవిత రాజీనామా ఆమోదంతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం అధికారికంగా ఖాళీ అయింది. ఉపఎన్నికలు ఆరు నెలల్లోపు పెట్టాల్సి ఉంది. 2021 డిసెంబర్లో జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో ఆమె ఎన్నికయ్యారు. ఆమె ప్రస్తుత పదవీకాలం జనవరి 4, 2028 వరకు ఉంది. అంటే ఇంకా రెండేళ్లకు పైగా గడువు ఉండగానే ఆమె తన పదవికి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఉపఎన్నికల్లోఆమె పోటీ చేసే అవకాశం లేదు. కానీ పదవి కాలం ఏడాది కంటే ఎక్కువే ఉన్నందున ఉపఎన్నికలు ఖాయంగా వచ్చే అవకాశం ఉంది.
వ్యూహాత్మక జాప్యం.. కాంగ్రెస్ లెక్కలివేనా?
సెప్టెంబర్ 3, 2025నే కవిత తన రాజీనామా లేఖను మండలి చైర్మన్కు పంపినప్పటికీ, జనవరి 6 వరకు ఆమోదానికి నోచుకోలేదు. ఈ జాప్యం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహాత్మక రాజకీయాలు ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. చట్టప్రకారం పదవీకాలం ఏడాది కంటే ఎక్కువ ఉంటే ఉపఎన్నిక జరపాలి. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు మాత్రమే. వీరెవరూ ఇప్పుడు ఓటర్లుగా లేరు. అందరి పదవీకాలాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.
స్థానిక ఎన్నికలు పూర్తయ్యాకే షెడ్యూల్
పరిషత్, మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. నిబంధనల ప్రకారం, పాత స్థానిక ప్రతినిధుల పదవీకాలం ముగిసి, కొత్తగా ఎన్నికైన వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఓటర్ల జాబితా సిద్ధమవుతుంది. కవిత రాజీనామాను ఇప్పుడు ఆమోదించడం ద్వారా, పాత సభ్యులతో ఉపఎన్నిక వచ్చే అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరోక్షంగా నిరోధించింది. కొత్తగా ఎన్నికయ్యే స్థానిక ప్రతినిధులంతా ఓటర్లుగా ఉన్నప్పుడే ఈ ఖాళీని భర్తీ చేయాలనేది ప్రభుత్వ ప్లాన్ లా కనిపిస్తోంది.
కవిత రాజీనామా ఆమోదంతో నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరం. ప్రస్తుతానికి పరిషత్ మరియు మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ స్థానం ఖాళీగానే ఉండే అవకాశం ఉంది. కొత్త సభ్యులు ఎన్నికై బాధ్యతలు చేపట్టిన తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్ కే చాన్స్
ప్రస్తుతం నిజామాబాద్ పరిధిలో బీఆర్ఎస్ బలహీనంగా మారింది. అక్కడ కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ తలపడుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు అలాగే వచ్చాయి. ఇక ఎమ్మెల్సీ కోసం అయినా… పరిషత్, కౌన్సిలర్ స్థానాలను అత్యధికంగా గెలుచుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పై పడింది. అందుకే స్థానిక ఎన్నికలను మరింత సీరియస్ గా కాంగ్రెస్ తీసుకునే అవకాశం ఉంది.
