పెద్ద నోట్ల రద్దుతో చేతిలో డబ్బులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. నల్లధనాన్ని అరికట్టడం, దొంగనోట్లకు చెక్ పెట్టడం సరే. అసలు పూట గడవాలి కదా. జేబులో ఉన్న 500, వెయ్య రూపాయల నోట్లు చెల్లవు. వాటిని మార్చుకుందామంటే బ్యాంకుల ముందు పొడుగాటు లైన్లు. పోనీ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుందామంటే అవీ తెరుచుకోలేదు.
హైదరాబాద్ లో ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి జనం అనేక చోట్లకు పరుగులు పెట్టడం కనిపించింది. కొన్ని బ్యాంకులకు అనుబంధంగా ఉన్న ఆన్ షోర్ ఏటీఎంలు తెరుచుకున్నాయి. దీంతో అక్కడ జనం క్యూకట్టారు. లక్షల మంది అవసరాలకు ఈ కొద్ది పాటి ఏటీఎంలు సరిపోవడం లేదు. బ్యాంకు బ్రాంచికి దూరంగా ఉన్న ఆఫ్ షోర్ ఏటీఎంలు ఏవీ తెరుచుకోలేదు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం శుక్రవారం ఉదయం నుంచే ఏటీఎంలలో డబ్బు అందుబాటులో ఉండాలి. కానీ జంట నగరాల్లోని వందల ఏటీఎంలలో ఇంకా డబ్బు నింపలేదు. ఔట్ సోర్సింగ్ వారు ఈ పనిని ఇంకా వేగంగా చేసి ఉంటే శుక్రవారం ఉదయానికే అది పూర్తయి ఉండేది. కానీ కొత్త నోట్లు రావడంలో ఆలస్యం జరిగిందో లేక అలసత్వమో గానీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకూ నగరంలోని వందలాది ఏటీఎంలు ఇంకా తెరుచుకోలేదు. వాటి ముందు ఔట్ ఆఫ్ సర్విస్ బోర్డులు వేలాడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి.
దీంతో చేసేది లేక, బ్యాంకుల్లోనే రూ. 4000 డ్రా చేసుకోవడానికి జనం అక్కడికే వెళ్తున్నారు. దీంతో అక్కడ లైన్ పెరిగిపోతోంది. గంటల తరబడి క్యూలో నిలుచోవడానికి కొందరు ఆఫీసులకు సెలవు పెట్టేశారు. కనీసం ఈరోజైనా ఏటీఎంలు తెరుచుకునేలా ప్రభుత్వం, బ్యాంకులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటే బాగుండేదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.