తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి కాలం కలసి వస్తోంది. హైదరాబాద్ లో కూల్చివేతలు ప్రారంభమైన తర్వాత భిన్నాభిప్రాయాలు వినిపించాయి. పేదల ఇళ్లు కూలుస్తున్నారన్న సెంటిమెంట్ ప్రయోగించేందుకు కొంత మంది రెడీ అయిపోయారు. అయితే ఇప్పుడు దానికికూడా అవకాశం లేకపోయింది. అసాధారణంగా వస్తున్న వరదలను తట్టుకునే శక్తి ప్రస్తుత నగరాలకు ఉండటం లేదని.. కబ్జా చేస్తున్న చెరువు.. నీరు పోయే మార్గాలను విస్తరించుకోకపోతే మొదటికే మోసం వస్తుందని తాజా వరదలు నిరూపించాయి.
విజయవాడ, ఖమ్మం నగరాలకు వచ్చిన వరదలు హైదరాబాద్ కు వచ్చి ఉంటే ఎదుర్కోవడం అసాధ్యం. నాలుగేళ్ల కిందట.. రెండు, మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షాలకు సగం హైదరాబాద్ అతలాకుతలమైపోయింది. వందల మంది కొట్టుకుపోయారు. అప్పటి ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తూండిపోయింది. ఆ ఘటన తర్వాతైనా యుద్ధ ప్రాతిపాదికన చెరువుల కబ్జాల నుంచి బయటపడేయాల్సింది. కానీ అలాంటి ప్రయత్నాలు జరగలేదు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట ఆయన చేయాలనుకున్న పని .. చెరువుల నుంచి కబ్జాల నుంచి బయటపడేయడమే. అలాగే మూసి ని హైదరాబాద్‌లో సంస్కరిస్తే.. ఓ పెద్ద ముప్పు తప్పినట్లే. అందుకే మూసి ప్రాజెక్టును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చూసినా రేవంత్ రెడ్డి .. హైడ్రా ప్రయత్నాలకు వంద శాతం సపోర్టు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. దీని నష్టపోయే సామాన్యలకు… వారికిఆ ఇళ్లను అమ్మిన వారి దగ్గర నుంచే పరిహారం ఇప్పిస్తే ఇంకా సంతోషిస్తారు.