ఇండియన్ స్క్రీన్ పై ‘నాయకుడు’ ఓ అద్భుతం. కమల్ హాసన్ – మణిరత్నంల అద్భుతమైన సృష్టి. ఆ తరవాత వీరిద్దరూ కలిసి పని చేయలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. దాదాపు ముఫ్ఫై ఎనిమిదేళ్ల గ్యాప్ తరవాత ఈ కాంబోలో ఓ సినిమా వస్తోందంటే ఎంత హైప్ ఉంటుంది? ఇంకెంత హంగామా కనిపిస్తుంది? కానీ ‘థగ్ లైఫ్’ విషయంలో ఆ ఊపు అంతంత మాత్రంగానే ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. తెలుగు బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి. తమిళంలో కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో కమల్ ఒక్కడే కాదు. శింభు, త్రిష.. లాంటి స్టార్ బలం వుంది. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు. తెలుగు మీడియాని పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. వైజాగ్ లో ఓ ఈవెంట్ చేశారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు. ఇంత చేసినా సరైన బజ్ రాకపోవడం విచిత్రంగా అనిపిస్తోంది.
థగ్ లైఫ్ ఓ రీమేక్ సినిమా. దానికి తోడు ఏఆర్ రెహమాన్ ఇచ్చిన పాటల్లో ఒక్కటీ ప్రేక్షకులకు చేరువ కాలేదు. ట్రైలర్ అంతంతమాత్రంగానే ఉంది. దాంతో ఈ సినిమాపై ఫోకస్ పడలేదు. మణిరత్నం సినిమాలు స్లో పాయిజన్ లాంటివి. మౌత్ టాక్ తో.. ఎక్కేసినా ఎక్కొచ్చు. ఫస్ట్ డే.. ఫస్ట్ షో.. బొమ్మ పడితే కానీ పరిస్థితిని పూర్తిగా ఎలలైజ్ చేయడం కష్టం. కాకపోతే ఒకటి.. తెలుగుతో పాటు, తమిళంలోనూ సినిమా చూడాలన్న మూడ్ ప్రేక్షకులకు కరువైపోతోంది. వాళ్లని థియేటర్లకు లాక్కొచ్చేంత వైబ్రేషన్స్ సినిమాలో కనిపిస్తే తప్ప.. థియేటర్లు నిండడం లేదు. వచ్చే వారం తెలుగులో ‘హరి హర వీరమల్లు’ విడుదల అవుతోంది. అందరి దృష్టీ ఆ సినిమాపై ఉంది. అందుకే ‘థగ్ లైఫ్’ గురించి ఇక్కడ పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా డబ్బింగ్ సినిమా అనే ముద్ర వుంది. మరి తమిళ ఆడియన్స్కి ఏమైందో?