అందుకే క్లైమాక్స్‌లో ఫైట్ తీసేశాం: హ‌రీష్ శంక‌ర్‌

క‌మ‌ర్షియ‌ల్ సినిమా అనగానే… క్లైమాక్స్‌లో ఓ భారీ ఫైటింగ్ త‌ప్ప‌ని స‌రి. విల‌న్ డెన్‌.. అందులో హీరో ఎంట్రీ, నాలుగైదు పంచ్ డైలాగులు, చివ‌రికి క‌త్తుల‌తో న‌రుక్కోవ‌డాలు, పిస్తోల్‌తో పేల్చుకోవ‌డాలు, బాంబులు విసురుకోవ‌డాలూ.. ఇవ‌న్నీ టంచనుగా క‌నిపిస్తుంటాయి. అయితే… ఈమ‌ధ్య ద‌ర్శ‌క నిర్మాత‌ల ఆలోచ‌న మారింది. క్లైమాక్స్‌ని మ‌రో ర‌కంగా ఎందుకు తీయ‌లేం? అని ప్ర‌శ్నించుకొంటున్నారు. అంతెందుకు.. ‘డీజే’ కూడా క్లైమాక్స్ లో ఫైట్ లేకుండానే ముగియ‌బోతోంది. అస‌లు ఈ ఆలోచ‌న ఎవ‌రికి వ‌చ్చింది? ఎందుకు వ‌చ్చింది??

ఈ విష‌యం గురించి డీజే ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ క్లారిటీ ఇచ్చారు. ”ఎంత‌టి భ‌యంక‌ర‌మైన విల‌న్ అయినా.. చివ‌రికి అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో అంతం అయిపోతుంటాడు. ఎందుకంటే.. జ‌న‌ర‌ల్‌గా క్లైమాక్స్ ఫైట్స్ అన్నీ అక్క‌డే తీస్తుంటాం క‌దా. ఈ ట్రెండ్‌ని మార్చాల‌నిపించింది. సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌లో ఆ ప్ర‌య‌త్నం కొంత వ‌ర‌కూ చేశా. ఇప్పుడు దిల్‌రాజు, బ‌న్నీ స‌హ‌కారంతో నా ఆలోచ‌న అమ‌లు చేశా. అస‌లు క్ల‌యిమాక్స్ ఫైట్‌తోనే ఎందుకు ముడిపెట్టాలి? అనే డౌట్ నాది. డీజే ఇంట్ర‌వెల్ కి ముందు ఓ మంచి ఫైట్ సీక్వెన్స్ ఉంది. ప్రీ క్లైమాక్స్ లో ఒక‌టి ఉంది. మ‌ళ్లీ క్లైమాక్స్ లో కూడా ఎందుకు అనిపించింది. హీరోయిజాన్ని, అభిమానుల్ని సంతృప్తి ప‌ర‌చాలంటే… డీజే కూడా క్లయిమాక్స్ లో ఫైటింగ్‌తో ముగించొచ్చు. కానీ ఫైట్ అవ‌స‌రం లేని క్లైమాక్స్ రాసుకొన్నా. అది దిల్‌రాజు గారికి న‌చ్చింది. గో ఎహెడ్ అన్నారు. అందుకే ఆ ధైర్యం చేశాం. చివ‌రి ప‌ది నిమిషాలూ హిలేరియ‌స్ గా న‌వ్వుకొంటారు. డీజే క్లైమాక్స్ అంద‌రికీ న‌చ్చుతుంది” అని కాన్ఫిడెన్స్ గా చెప్పాడు హ‌రీష్ శంక‌ర్‌. మ‌రి ఈ ప్లాన్ ఎంత వ‌ర‌కూ వ‌ర్క‌వుట్ అయ్యిందో తెలియాలంటే రేప‌టి వ‌ర‌కూ ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.