ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అంశాన్ని భాజపా ఇంకా వదలడం లేదు. ఆ సందర్భంలో కేసీఆర్ మాట దొర్లి ఉంటారని తెలంగాణ నేతలు చెబుతున్నా… భాజపా నేతలు మాత్రం లాజిక్కులు తీస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ మాట తూలి ఉంటే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నాననిగానీ, క్షమాపణ కోరడం వంటివి జరగాలి కదా అంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే మోడీని అన్నారనీ.. అలాకకాపోయి ఉంటే ఆ మర్నాడు ఆదిలాబాద్ లో జరిగిన బహిరంగ సభలో తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు కేసీఆర్ ఎందుకు మాట్లాడారు అంటూ భాజపా నేత ఇంద్రసేనా రెడ్డి నిలదీస్తున్నారు.
ఇదే అంశమై ఎంపీ కవిత కూడా నిన్ననే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైతుల కష్టాల గురించి సీఎం మాట్లాడుతూ, ఆవేదన చెందిన సందర్భంలో ‘మోడీ గారు’ అనబోతుండగా మాటి జారి ఉంటుందని కవిత చెప్పారు. ప్రధానమంత్రిని అవమానపరచే సంకుచిత మనస్తత్వం సీఎంకి లేదన్నారు. 600 కోట్ల మంది తనకు ఓటేశారంటూ గతంలో ప్రధాని మోడీ కూడా మాట జారిన సందర్భం ఉందన్నారు. మాటల సందర్భంలో దొర్లిన ఒక పదాన్ని పట్టుకుని భాజపా నేతలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. నిజానికి, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా కేసీఆర్ వ్యాఖ్యలపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తే… మంత్రి కేటీఆర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
సీఎం వ్యాఖ్యలపై ఇంత చర్చ జరుగుతున్నా, దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం తెరాస చేయడం లేదనే చెప్పాలి. కేసీఆర్ నోరు జారారు అని తెరాస నేతలు అంటున్నా… దీనికి సంబంధించి ఒక చిన్న ప్రకటన ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసి ఉంటే సరిపోయేది. కానీ, భాజపాపై మాటల దాడి పెంచే క్రమంలో ఇప్పుడు సీఎం ఉన్నారు. కాబట్టి, దీనిపై ఇలాంటి వివరణ ఇవ్వడం సరికాదన్నది కూడా ఆయన వ్యూహం అయి ఉండొచ్చు. ఎందుకంటే, రైతుల సమస్యల విషయమై కేసీఆర్ ప్రధానంగా మోడీ సర్కారును లక్ష్యం చేసుకునే విమర్శల దాడి పెంచుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్లనే తెలంగాణలో రైతులకు కష్టాలని విమర్శిస్తున్నారు. కేంద్రంపై కేసీఆర్ కూడా నెమ్మదిగా అసంతృప్తి వెళ్లగక్కడం మొదలుపెట్టారు. నిజానికి, భాజపాతో మైత్రి కోసం అర్రులు చాచిందీ ఆయనే. ఎన్డీయే తీసుకున్న నోట్లు రద్దు నిర్ణయంగానీ, జీఎస్టీ అమలు వంటి కీలక సందర్భాల్లో మోడీకి బాసటగా నిలిచారు. కానీ, ఇప్పుడు కేసీఆర్ స్వరంలో మార్పు చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి, ప్రధానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కాకపోయినప్పటికీ, ఉద్వేగంలో అనేసిన మాటలుగానే చూడాలంటున్నారు!